ఖమ్మంక్రైం: ‘అమ్మా పెద్దవాడిని. రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్నా.. మీరు టికెట్ తీసుకోకపోవడంతో చెకింగ్ ఉందనే ఆందోళనలో గట్టిగా మందలించాను.. నన్ను క్షమించు’ అని బతిమిలాడినా వినకుండా ఓ ప్రయాణికురాలు, ఆమె బంధువులు ఖమ్మం బస్టాండ్‌లో కండక్టర్‌పై దాడి చేసిన ఘటన ఇది. ఖమ్మం డిపోకు చెందిన కండక్టర్ తాళ్లూరి అంజయ్య మంగళవారం విధుల్లో భాగంగా హైదరాబాద్ నుంచి వస్తూ సూర్యాపేటలో పలువురు ఎక్కాక తిరిగి బయలుదేరాడు. అయితే, లెక్క చూసుకోగా సయ్యద్ తైసీన్ టికెట్ తీసుకోలేదని గుర్తించాడు. ఈమేరకు టికెట్ తీసుకోకపోతే చెకింగ్ ఉద్యోగులు వస్తే తన ఉద్యోగం పోతుందంటూ ఆయన ‘దొంగలా దాక్కున్నావు, టికెట్ తీసుకుంటే ఏమిటి’ అన్నాడు. ఆ తర్వాత ఆమె బాధపడడం చూసిన ఆయన ‘అమ్మా ఆందోళనలో అన్నాను. క్షమించు’ అని కోరాడు. అయితే, ఆమె విషయాన్ని తన బంధువులకు ఫోన్‌లో చెప్పగా బస్సు ఖమ్మం నూతన బస్టాండ్‌కు వచ్చేసరికి చేరుకున్న పలువురు కండక్టర్ అంజయ్యపై దాడి చేశారు. సెక్యూరిటీ సిబ్బంది, ఔట్ పోస్ట్ పోలీసులు అడ్డుకున్నా వినకపోగా, అంజయ్య బ్రతిమాలుతున్నా దాడి కొనసాగించారు. దీంతో ఆయనను జిల్లా ఆస్పత్రికి తరలించగా డిపో మేనేజర్ శివప్రసాద్, ఉద్యోగులు పరామర్శించారు. కాగా, దాడికి పాల్పడిన తౌఫియా, సద్దాం, జానీ, బాషా తదితరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.
ఖమ్మంలో కండక్టర్‌పై దాడి చేసిన పలువురు


