కృష్ణమ్మ కరుణిస్తుందా?! | - | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ కరుణిస్తుందా?!

Jun 23 2026 1:34 AM | Updated on Jun 23 2026 1:34 AM

అపరాల సాగే మంచిది ఉన్న నీరు సరిపోదు..

సాగర్‌ జలాలు కష్టమే..

ఖరీఫ్‌ అవసరాలకు

3 టీఎంసీల నీరు అవసరం

ప్రస్తుతం 1.5 టీఎంసీలే నిల్వ

తాగునీటి అవసరాలకే ప్రాధాన్యత అంటున్న యంత్రాంగం

వైరా: జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో కీలకమైన వైరా రిజర్వాయర్‌ ఆయకట్టు పరిధిలో ఈ ఏడాది వరి సాగుపై అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నెస్పీ ద్వారా వచ్చే కృష్ణా జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. అయితే, ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురవుతాయని చెబుతున్నారు. జిల్లాలో కూడా వర్షాలు లేక నీరు చేరకపోగా.. సాగర్‌ నుంచి కూడా వస్తాయో, లేదో తెలియక వరి సాగుకు నీటి విడుదలపై స్పష్టత రావడం లేదు. దీంతో రైతులు వరి నారుమళ్ల పరిస్థితి తెలియక ఎదురుచూస్తున్నారు.

గత ఏడాది ఈ పాటికే..

వైరా రిజర్వాయర్‌ పూర్థిస్థాయి సామర్థ్యం 18.3 అడుగులుగా ఉంటుంది. ఈ స్థాయిలో నీరు చేరితే 2.5 నుంచి 3 టీఎంసీలుగా పరిగణిస్తారు. గత ఏడాది జూన్‌ 15 నాటికే రిజర్వాయర్‌ 18 అడుగులకు చేరింది. కానీ ప్రస్తుతం వర్షాలు లేకపోగా, 13.8 అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. అంటే 1.5 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ప్రథమ ప్రాధాన్యత తాగునీటి అవసరాలకేనని అధికారులు చెబుతుండడంతో సాగు అవసరాలకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాక వ్యవసాయ శాఖ అధికారులు సైతం సాగుపై అవగాహన సదస్సులు, ఖరీఫ్‌ ప్రణాళికపై ముందస్తు సమావేశాలు నిర్వహించకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అయినా రైతులు మాత్రం వరి సాగుపై ఆశతో జిలుగులు, జనుము విత్తనాలు నాటారు.

3 టీఎంసీలు ఉంటేనే..

వైరా రిజర్వాయర్‌ కింద ఏటా ఖరీఫ్‌లో సుమారు 25 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. నారుమళ్లకు నీరు విడుదల చేయాలంటే 0.08 టీఎంసీలు అవసరం. అయితే, రిజర్వాయర్‌ పూర్తిస్థాయి సామర్థ్యమైన 18.3 అడుగుల మేర నిండితేనే నారుమళ్లకు సిద్ధం కావాలని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 13.8 అడుగుల నీరే ఉండగా, జిల్లాలోని 11 మండలాలకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా రోజుకు కోటి లీటర్లకు పైగా నీటిని తాగు అవసరాలకు విడుదల చేస్తున్నారు. ఇక ఉష్ణోగ్రతల కారణంగా ఆవిరి రూపంలో మరికొంత వృథా అవుతోంది. ఫలితంగా రిజర్వాయర్‌లోకి గరిష్ట స్థాయిలో నీరు చేరితే తప్ప సాగు అవసరాలకు విడుదల చేసే పరిస్థితి కానరావడం లేదు.

కొనసాగుతున్న ఆధునికీకరణ పనులు

రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాల్వ పరిధిలో ప్రస్తుతం రూ.40 కోట్ల వ్యయంతో కల్వర్టులు, గైడ్‌ వాల్వ్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కుడి కాల్వ పరిధిలో కోస్తాల, కొండికొడిమ, ఎడమ కాలువ పరిధిలో విప్పలమడక నుంచి గైడ్‌ వాల్వ్‌ పనులు చేపడుతున్నారు. ఈసారి వర్షాలు కూడా లేకపోవడంతో మరో నెల పాటు పనులు కొనసాగుతాయి.

వైరా రిజర్వాయర్‌ ఆయకట్టు పరిధిలో రైతులెవరూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. రిజర్వాయర్‌లో వరి సాగుకు సరిపడా నీరు లేదు. అందుకే వరి పంట కాకుండా అపరాలు తదితర పంటలపై దృష్టి సారిస్తేనే మంచిది.

– టి.కరుణశ్రీ, ఏడీఏ, వైరా

రిజర్వాయర్‌ ఆయకట్టులో వరి సాగుకు ప్రస్తుతం ఉన్న నీరు సరిపోదు. ఉన్న నీటిని తాగు అవసరాలకే వినియోగిస్తాం. సాగర్‌ నీరు విడుదలై రిజర్వాయర్‌ నిండితేనే నారుమళ్లకు విడుదల చేస్తాం. ఈ విషయాన్ని గుర్తించి రైతులు తొందరపడవద్దు.

– శ్రీనివాస్‌, నీటిపారుదల శాఖ, డీఈ

వైరా రిజర్వాయర్‌లోకి సాగర్‌ జలాలు ఈ ఏడాది వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం సాగర్‌లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేక దిగువ ప్రాంతాల్లోకి విడుదలపై స్పష్టత రావడం లేదు. మరోవైపు వైరా ఆయకట్టు ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఇక గోదావరి జలాలను రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ ద్వారా వైరా రిజర్వాయర్‌లోకి మళ్లిస్తే రైతులకు ఊరటగా ఉండేది. కానీ పనులు పూర్తికానందున ఆ పరిస్థితి కూడా లేదు.

వైరా రిజర్వాయర్‌ ఆయకట్టులో సాగుపై నీలినీడలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement