క్యూఆర్‌ కోడ్‌ పేరుతో దోపిడీ | - | Sakshi
Sakshi News home page

క్యూఆర్‌ కోడ్‌ పేరుతో దోపిడీ

Jun 23 2026 1:34 AM | Updated on Jun 23 2026 1:34 AM

● రవాణా శాఖ కార్యాలయ ఆవరణలోనే రెట్టింపు వసూళ్లు ● వాహనదారులపై మోయలేని భారం ఇంత దారుణమా ? ధరలపై ఆరా తీస్తాం..

స్టిక్కర్‌, క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటుకు వసూలు చేస్తున్న ధరలు

● రవాణా శాఖ కార్యాలయ ఆవరణలోనే రెట్టింపు వసూళ్లు ● వాహనదారులపై మోయలేని భారం

ఖమ్మంక్రైం: వాహనాలకు రెట్రో రిఫ్లెక్టివ్‌, క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు పేరుతో దోపిడీ చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. మూడు నెలల క్రితమే అన్ని వాహనాలకు చుట్టూ స్టిక్కర్‌ వేయించడమే కాక వివరాలతో క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేయించుకోవాలని రవాణా శాఖ ఆదేశించింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా వాహనదారుల ఆందోళనతో అమలును నిలిపివేసింది. మళ్లీ గుట్టుచప్పుడు కాకుండా మూడు రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని ప్రారంభించారు. దీంతో స్టిక్కర్లు వేయడం, క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటుచేసే బాధ్యత దక్కించుకున్న ప్రైవేట్‌ ఏజెన్సీల వారు నిలువు దోపిడీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

అన్నింటికీ తప్పనిసరి

అన్ని వాహనాలకు క్యూఆర్‌ కోడ్‌ను తప్పనిసరి చేశారు. దీంతో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చే వాహనాలకు రిఫ్లెక్టివ్‌ టేప్‌తో పాటు క్యూఆర్‌ కోడ్‌ వేస్తున్నారు. ఇవిలేకుండా వాహనాలను రవాణా శాఖ అధికారులు సీజ్‌ చేస్తారనే బెదిరింపులతో వాహనదారులు సరే అంటున్నారు. కానీ, రెట్టింపు రేట్లు వసూలు చేస్తుండడంపై వారిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో ఒక బస్సుకు అక్కడక్కడా కలిపి మొత్తం ఆరు మీటర్ల టేప్‌ వేస్తే సరిపోయేది. దీనికి రూ.600వరకు ఖర్చయ్యేది. కానీ ఇప్పుడు బస్సు చుట్టూ టేప్‌ వేయడమే కాక క్యూఆర్‌ కోడ్‌కు కలిపి రూ.15 వేల మేర వసూలు చేస్తుండడం వాహనదారుల ఆవేదనకు కారణమవుతోంది. వాస్తవానికి క్యూఆర్‌ కోడ్‌ నిబంధన మోటారు వాహన చట్టంలో ఎక్కడా లేదని, అయినా ఇతర రాష్ట్రాల కంపెనీలకు లాభం జరిగేలా రవాణా శాఖ ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. వీటి బాధ్యతలు అప్పగించేందుకు బిడ్డింగ్‌ ద్వారా ఐదు కంపెనీలను ఎంపిక చేయగా ఒక కంపెనీ టేపులనే విక్రయిస్తుండడం గమనార్హం. రాత్రి వేళ రోడ్లపై నిలిపే వాహనాలు కనిపించేలా నాలుగు వైపులా అక్కడక్కడా టేపు అతికిస్తే సరిపోతుంది. కానీ వాహనం చుట్టూ అతికించాలనే నిబంధనతో 20 మీటర్లకుపైగా అవరమవుతోంది.

క్యూఆర్‌ కోడ్‌, రెట్రో రిఫ్లెక్టివ్‌ పేరుతో దండుకుంటున్నారు. ఫిట్‌నెస్‌ చేయడానికి ఇవి తప్పనిసరి అని చెబుతూ ఎక్కడా లేనంత బిల్లు వేశారు. ఇదేమిటని ఆరా తీస్తే రవాణాశాఖ సిబ్బందినే అడగాలని ఏజెన్సీ బాధ్యులు దబాయించారు. ఇక్కడ వేస్తున్న స్టిక్కర్‌ కూడా నాణ్యతగా లేదు. రవాణాశాఖ అప్పగించిన కంపెనీవాళ్లే దీనిని చేస్తున్నారు. –రంగయ్య, లారీ డ్రైవర్‌

క్యూఆర్‌ కోడ్‌, స్టిక్కర్లు వేసేందుకు రాష్ట్రమంతా ఐదు కంపెనీలకు అనుమతి ఉంది. ఇక ధరలను కూడా రవాణా శాఖ స్పష్టంగా నిర్దేశించింది. దీంతో జిల్లా కార్యాలయ ఉద్యోగులకు సంబంధం ఉండదు. నిర్దేశిత ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని ఫిర్యాదు అందితే పరిశీలిస్తాం.

–శ్రీనివాసరావు, ఇన్‌చార్జ్‌ ఆర్‌టీఓ

వాహనం పాత టేపు ధర కొత్త టేపు ధర

(మీటర్లలో) (రూ.ల్లో) (మీటర్లలో) (రూ.ల్లో)

బస్సు 6 600 20 15,000

లారీ 6 600 20 12,500

గూడ్స్‌ వెహికిల్‌ 5 500 12 8,500

మ్యాక్సీ క్యాబ్స్‌ 3 300 5 – 8 2,700

ఆటో 1 100 1 150

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement