అగ్నివీర్‌కు ఖమ్మం అకాడమీ అథ్లెట్లు | - | Sakshi
Sakshi News home page

అగ్నివీర్‌కు ఖమ్మం అకాడమీ అథ్లెట్లు

Jun 23 2026 1:34 AM | Updated on Jun 23 2026 1:34 AM

ఖమ్మం స్పోర్ట్స్‌: సైన్యంలో ప్రవేశాలకు నిర్వహించిన అగ్నివీర్‌ ఎంపికల్లో ఖమ్మం అథ్లెటిక్స్‌ అకాడమీ క్రీడాకారులు ఇద్దరు ఎంపికయ్యారు. ఇక్కడ పరుగు పందెంలో శిక్షణ పొందుతున్న ఎస్‌.గోపీచంద్‌, బి.వీరభద్రం పలు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించారు. ఇటీవల జరిగిన అగ్నివీర్‌ ఎంపికల్లో ప్రతిభ చాటి జనరల్‌ డ్యూటీ(జీడీ)కి ఎంపికయ్యారు. ఖమ్మంలోని కేఎంసీడీసీలో ఎస్‌.గోపీచంద్‌ ఇటీవలే డిగ్రీ పూర్తిచేయగా, బి.వీరభద్రం తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా, గోపీచందర్‌ తండ్రి గత నెలలో మృతి చెందినా, ఆ బాధను దిగమింగుకుని ఎంపిక ప్రక్రియలో పాల్గొని ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా క్రీడాకారులను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, అకాడమీ చీఫ్‌ కోచ్‌ ఎం.డీ.గౌస్‌ తదితరులు అభినందించారు.

తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలి

కొణిజర్ల: స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ ఆదేశించారు. కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌ను సోమవారం తనిఖీ చేసిన ఆయన ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారితో మాట్లాడారు. ఈక్రమాన పోలీసు సిబ్బంది పనితీరుపై ఆరాతీశారు. అనంతరం సీపీ స్టేషన్‌లో రికార్డులు, కేసులు, విచారణపై సమీక్షించారు. కేసుల విచారణలో వేగం పెంచి పూర్తి సాక్షాలతో కోర్టులో చార్జీషీట్లు దాఖలు చేయాలని సూచించారు. అంతేకాక సీసీ కెమెరాల ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ఎస్‌ఐ సూరజ్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

నేటి నుంచి విత్తన మేళా

విత్తనాలు, ఎరువుల విక్రయానికి ఏర్పాట్లు

ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని రైతు వేదికల్లో మంగళవారం నుంచి వారం పాటు వ్యవసాయ శాఖ ఆధ్వర్యాన విత్తన మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) ధనసరి పుల్లయ్య తెలిపారు. వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యాన రైతులకు 122 రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. వరిలో సన్న రకాలైన బీపీటీ–5204, ఆర్‌ఎన్‌ఆర్‌–15048, డబ్ల్యూజీఎల్‌–44, కేఎన్‌ఎం–1638, కేఎన్‌ఎం–7715, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరాం విత్తనాలే కాక పెసర, కంది, మినుము వంటి అపరాల విత్తనాలు, పచ్చిరొట్ట విత్తనాలు అమ్మకానికి ఉంటాయని తెలిపారు. అలాగే, యూరియాకు ప్రత్యామ్నాయమైన నానో యూరియా, నానో డీఏపీకి కూ డా అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఇవికాక 38రైతు వేదికల్లో ప్రత్యేకంగా యూరి యా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఏఓ తెలిపారు. రైతులు యూరియా బుక్‌ చేసుకొని కొనుగోలు చేయవచ్చని వివరించారు.

బీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రీ–మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు

ఖమ్మంమయూరిసెంటర్‌: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, ఎయిడెడ్‌, మున్సిపల్‌ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న అర్హులైన బీసీ, ఈ బీసీ విద్యార్థుల నుంచి ప్రీ–మెట్రిక్‌ ఉపకార వేతనాల(ఫ్రెష్‌, రెన్యూవల్‌) కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి.జ్యోతి తెలిపారు. అర్హులైన విద్యార్థులకు ఏటా రూ.4వేల చొప్పు న ఉపకారవేతనాలు మంజూరవుతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులైతే కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లోనైతే రూ.2 లక్షల లోపు ఉన్న వారు అర్హులని తెలిపారు. ఆధార్‌ కార్డు, స్టడీ సర్టిఫికెట్‌ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్‌ ఫొటో, బ్యాంక్‌ ఖాతా జిరాక్స్‌ సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. దరఖాస్తు కోసం గూగుల్‌ ప్లే స్టోర్‌ నుండి NSP OTR App డౌన్‌లోడ్‌ చేసుకుని, ఆధార్‌ నంబర్‌, ఫేస్‌ ఐడీ ద్వారా 14అంకెల ఓటీఆర్‌ నంబర్‌ తీసుకోవా లని సూచించారు. ఆతర్వాత మీసేవా కేంద్రంలో ఈ–పాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకొని, బయోమెట్రిక్‌ ధ్రువీకరణ పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం హెచ్‌ఎంలు దరఖాస్తులను పరిశీలించి, తమ కార్యాలయానికి ఆన్‌లైన్‌లో పంపించడమే కాక సంతకంతో కూడిన దరఖాస్తులు, ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement