మహిళలకు సముచిత స్థానం | - | Sakshi
Sakshi News home page

మహిళలకు సముచిత స్థానం

Jun 23 2026 1:34 AM | Updated on Jun 23 2026 1:34 AM

వైఎస్సార్‌ తర్వాత మళ్లీ ఇప్పుడే..

30 నెలల్లో రూ.67 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు

మహిళా కాంగ్రెస్‌ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి

ఖమ్మంమయూరిసెంటర్‌: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక మహిళలకు సముచిత స్థానం కల్పించడమే కాకుండా.. అర్హులందరికీ విప్లవాత్మక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ప్రగతిని మహిళా కాంగ్రెస్‌ శ్రేణులు ఇంటింటా వివరించాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలో సోమవారం జరిగిన మహిళా కాంగ్రెస్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పాలకుల పదేళ్ల పాలనలో పేదలు ఇళ్ల కోసం ఎదురుచూసి అలసిపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం చేస్తోందని, తొలి దశలో 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు.

ప్రజాసంక్షేమానికి కృషి

ఐదేళ్లలో మహిళా సంఘాల సభ్యులకు రూ.లక్ష కోట్ల రుణాలు ఇవ్వడమే లక్ష్యం కాగా, తొలి రెండున్నరేళ్లలో రూ.67 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని భట్టి వెల్లడించారు. అలాగే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పాటు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయించి మహిళలనే యజమానులను చేసిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పార్టీ కోసం కష్టపడిన మహిళా నాయకులకు సముచిత గౌరవం, పదవులు దక్కేలా చూసే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో పాటు తాను తీసుకుంటానని తెలిపారు. ఈ నేపథ్యాన పార్టీ బలోపేతానికి మహిళా నాయకులు నడుం బిగించడమే కాక ఓటరు జాబితా సవరణపై దృష్టి సారించాలని సూచించారు.

దివంగత ముఖమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో మహిళలకు పెద్దపీట వేశారని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గుర్తుచేశారు. ఆ సమయాన చట్టసభల్లోనే కాక రాజకీయంగా పదవులు కల్పించారని తెలిపారు. వైఎస్సార్‌ మరణం తర్వాత మళ్లీఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహిళలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. రాబోయే కాలంలో ఏర్పాటు చేసే కమిటీల్లోనూ మహిళలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్‌ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్‌, కార్పొరేషన్ల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యం, పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, ఏదులాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకబత్తిని అనిత, మాజీ మేయర్‌, డిప్యూటీ మేయర్లు పునుకొల్లు నీరజ, ఫాతిమా జోహరా తదితరులు పాల్గొన్నారు. కాగా, తొలుత ఎర్రబెల్లి స్వర్ణను డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తదితరులు సన్మానించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement