కారేపల్లి: ఓ కుటుంబం ఉక్కపోత తట్టుకోలేక ఆరుబయట నిద్రిస్తుండగా, వెనక నుంచి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. కారేపల్లి బస్టాండ్ సెంటర్, డీసీసీ బ్యాంకు వెనకబజార్‌లో నివాసం ఉండే కేతిమాల సురేశ్ కుటుంబీకులు ఆదివారం రాత్రి ఆరుబయట నిద్రించారు. ఈ క్రమాన దుండగులు అర్ధరాత్రి సమయాన డీసీసీ బ్యాంకు వెనక గోడ దూకి, ఆపై సురేశ్ ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాపై ఉన్న తాళాలతో తెరిచి ఐదు తులాల బంగారు ఆభరణాలు, రెండు జతల వెండి పట్టీలు, పూజ గదిలోని కొంత నగదు చోరీ చేశారు. మొత్తంగా రూ.8 లక్షల విలువైన సొత్తు చోరీకి గురైందని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారేపల్లి ఎస్‌ఐ బి.గోపి క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.
మూడు ఇసుక లారీలు సీజ్
రఘునాథపాలెం: అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్న మూడు లారీలను సీజ్ చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి రఘునాథపాలెం మండలం కంకర మిల్లుల వద్దకు లారీల్లో ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో సోమవారం తనిఖీలు చేపట్టామని వెల్లడించారు. ఈ క్రమాన రెండు లారీల డ్రైవర్లు పరారు కాగా, ఇంకో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు వాహనాలకు పైలట్‌గా వచ్చిన కారులోని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కాగా, సీజ్ చేసిన మూడు లారీల్లో 106 టన్నుల ఇసుక ఉందని పేర్కొన్నారు.


