పర్యవేక్షణ శూన్యం | - | Sakshi
Sakshi News home page

పర్యవేక్షణ శూన్యం

Jun 23 2026 1:34 AM | Updated on Jun 23 2026 1:34 AM

‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’!

ముందస్తు సమాచారంతో వెళ్తుండడంతో అంతా సక్రమం!

ఆపై నివేదికలు ఇస్తున్నా పట్టించుకోని అధికారులు

లక్ష్యం ఘనం..

ఖమ్మంమయూరిసెంటర్‌: ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు అందుతున్నాయా, లేదా అని పరిశీలించేందుకు జిల్లా యంత్రాంగం ప్రవేశపెట్టిన స్పెషల్‌ ఆఫీసర్ల (ప్రత్యేక అధికారులు) వ్యవస్థ క్రమంగా గాడి తప్పుతోంది. ప్రారంభంలో కాస్త హడావుడి కనిపించినా.. కాలక్రమేణా ఇదంతా కాగితాలకే పరిమితమవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు వచ్చి విద్యార్థులతో కలిసి భోజనం చేయడమే కాక గదులు, ఆవరణలో పరిశీలించి ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం ఇది ‘ఫొటోల’ముచ్చటగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో వసతిగృహాలు, గురుకులాల్లో తనిఖీకి ప్రత్యేక అధికారులను మరోసారి నియమించడం గమనార్హం.

ప్రారంభంలో జోరు

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, అందుతున్న భోజనం, వసతి సదుపాయాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులతో తనిఖీ చేయిస్తున్నారు. వ్యవస్థ ప్రారంభమైన మొదటి రెండు, మూడు నెలల పాటు ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో గట్టిగానే నివేదికలు ఇచ్చారు. వీటిపై అదనపు కలెక్టర్‌ ఆధ్వర్యాన సమీక్షలు కూడా జరిగాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వార్డెన్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో వసతిగృహాల నిర్వహణలో కొంత మార్పు కనిపించింది. అయితే, ఆ తర్వాత సమీక్షలు మందగించడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ప్రత్యేక అధికారులు ఇస్తున్న నివేదికలు జిల్లా కార్యాలయాల్లో పేరుకుపోతుండగా, క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

అదనపు బాధ్యతలతో నామమాత్రం

స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమితులైన అధికారులు ఇప్పటికే తమసొంత శాఖల బాధ్యతల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. దీనికితోడు గురుకులాలు, హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించడంతో వారు సమగ్రంగా తనిఖీ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. వెళ్లామా, హాజరు రిజిస్టర్‌ చూశామా, విద్యార్థులతో కూర్చుని భోజనం చేశామా అన్న చందంగా తనిఖీలు సాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయాన ప్రతీ సంక్షేమ శాఖలో జిల్లా, డివిజనల్‌ స్థాయి అధికారులు ఉన్నా వారు బాధ్యతగా పనిచేయకపోవడంతోనే ఇతర శాఖల నుంచి ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు తెలుస్తోంది. అయితే, ఉన్న వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి, ఇతర శాఖల అధికారులతో పర్యవేక్షణ ఎందుకనే ప్రశ్నలు వస్తున్నాయి.

నివేదికలు ఉన్నా.. చర్యలేవి?

ఏడాది కాలంగా హాస్టళ్లు, వసతిగృహాల్లో తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుత్‌ సమస్యలు, భవనాల మరమ్మతులపై ప్రత్యేక అధికారులు పలుమార్లు నివేదికలు సమర్పించారు. కానీ, వాటిపై ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు. చిన్నచిన్న మరమ్మతులకు కూడా నిధులు మంజూరు కాక సమస్యలు అలాగే ఉండిపోయాయి. ‘మేము నివేదికలు ఇవ్వడం.. వారు ఫైళ్లలో పెట్టడం తప్ప లాభం ఏముంది?’అని కొందరు అధికారులు సైతం పెదవి విరుస్తున్నారని సమాచారం. ప్రత్యేక అధికారులు ఇకనైనా ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా గురుకులాలు, వసతిగృహాలను తనిఖీ చేసి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడితేనే సమస్యలు బయటపడే అవకాశముంది. అంతేకాక తనిఖీల నివేదికల ఫొటోలు, వీడియోలను జియో ట్యాగింగ్‌తో కూడిన యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే ఉన్నతాధికారుల పర్యవేక్షణకు వీలవుతుంది. అంతేకాక కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ స్థాయి అధికారులు ప్రతీనెల నివేదికలపై సమీక్షించి తప్పులు జరిగిన బాధ్యులపై చర్యలు తీసుకుంటే లక్ష్యం నెరవేరడమే కాక విద్యార్థులకు మేలు జరుగుతుంది. అలాగే, వసతిగృహాల్లో చిన్నచిన్న మరమ్మతులకు అత్యవసర నిధులు కేటాయించాలన్న సూచనలు కూడా వస్తున్నాయి.

స్పెషల్‌ ఆఫీసర్లు చాలా సందర్భాల్లో తాము ఏ హాస్టల్‌లో తనిఖీకి వెళ్తున్నది అక్కడి ఉద్యోగులకు ముందుగానే సమాచారం ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో అక్కడి ఉద్యోగులు అప్రమత్తమై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్నిచోట్ల రికార్డుల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను సరిచేసేందుకు స్థానిక విద్యార్థులను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాక తనిఖీ జరిగే రోజే మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డించి అంతా సవ్యంగానే ఉందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని వసతిగృహాలు, గురుకులాల్లో ఈ తీరు అధికంగా ఉందనే చర్చ జరుగుతోంది.

గురుకులాలు, హాస్టళ్లలో తనిఖీలు అంతంతే

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement