ఖమ్మంలీగల్: మధిర స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్‌గా సయ్యద్ సలీం పాషా నియమితులయ్యారు. ఆయన గతంలో ఖమ్మం జిల్లా స్పెషల్ జ్యుడీడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్‌గా పనిచేశారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే ఖమ్మం స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఎకై ్సజ్‌గా కె.విజయలక్ష్మి నియమితులయ్యారు.
రేపు జాబ్ మేళా
ఖమ్మంరాపర్తినగర్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 24వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి తెలిపారు. శేషసాయి ఎంటర్‌ప్రైజెస్‌లో 35 ఖాళీల భర్తీకి కంపెనీ బాధ్యులు ఇంటర్వ్యూ నిర్వహిస్తారని వెల్లడించారు. ఎస్సెస్సీ మొదలు డిగ్రీ వరకు విద్యార్హత ఉన్న వారు బుధవారం ఖమ్మం టీటీడీసీ భవన్‌లో జరిగే జాబ్‌మేళాకు హాజరుకావాలని, వివరాలకు 90308 02174 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.
రేపు బీఏఎస్ లక్కీ డ్రా
ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన కొనసాగుతున్న బీఏఎస్ పథకానికి సంబంధించి విద్యార్థుల ఎంపిక కోసం ఈ నెల 24న లక్కీ డ్రా ఏర్పాటు చేశామని ఎస్సీ డీడీ జి.జ్యోతి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఒకటో తరగతి ప్రవేశానికి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదో తరగతి విద్యార్థుల ఎంపికకు లాటరీ తీస్తామని వెల్లడించారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగే కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరు కావాలని సూచించారు.
గ్రామాల్లో పశువుల
అపహరణ
ఏజెంట్లను నియమించుకుంటున్న
నిందితులు?
ఖమ్మంరూరల్: మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న పశువుల చోరీలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గోళ్లపాడు, పోలేపల్లి, తీర్థాల తదితర ప్రాంతాల రైతులకు చెందిన సుమారు 50 పశువులు ఇటీవల చోరీ అయినట్లు తెలిసింది. వేసవి కావడంతో పశువులను రైతులు మేత కోసం అడవిలో, చేల వద్దకు వదులుతుంటారు. ఇదే అదునుగా భావించిన దొంగల ముఠా పశువులను చోరీ చేసి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నట్లు తెలిసింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గ్రామానికి ఒకరిద్దరు ఏజెంట్లను నియమించుకుని పశువులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాక అపహరించి వాహనాల్లో హైదరాబాద్ తరలిస్తున్నట్లు సమాచారం. అక్కడ పశువుల మాంసం అమ్మే వ్యాపారులకు అమ్ముకుంటున్నారని తెలిసింది. వారం క్రితం దొంగలు నాలుగు పశువులను అపహరించి తీసుకెళ్తుండగా తీర్థాల వద్ద రైతులు అడ్డగించడంతో వారిని బుకాయించి జారుకున్నట్లు తెలిసింది. కాగా, గోళ్లపాడు రైతు మద్ది గంగిరెడ్డికి చెందిన చెందిన రూ.1.20 లక్షల విలువైన ఆవు గత నెలలో తప్పిపోవడంతో రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అలాగే మరికొందరు రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు విచారణ చేస్తున్నారని తెలిసింది.
విద్యుదాఘాతంతో
గేదె మృతి
నేలకొండపల్లి: విద్యుత్ ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా ఇటీవల మూగజీవాల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. మండలంలోని అప్పలనరసింహాపురంలో సోమవారం ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ క్రమాన గ్రామవాసి ఎనికె నరసింహారావుకు చెందిన గేదెలు మేతకు వెళ్లగా ఒకటి విద్యుత్ తీగలను తాకడంతో షాక్‌కు గురై మృతి చెందింది. సమీపంలో ఉన్న పెంపకందారులు, రైతులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రూ.1.50 లక్షల విలువైన గేదె మృతితో నష్టపోయిన తనకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని నరసింహారావు కోరారు.


