యూరియా ఇవ్వలేని ప్రభుత్వమిది.. | - | Sakshi
Sakshi News home page

యూరియా ఇవ్వలేని ప్రభుత్వమిది..

Jun 23 2026 1:34 AM | Updated on Jun 23 2026 1:34 AM

‘సర్‌’తో అధికారం కోసం

బీజేపీ యత్నాలు

మాజీ మంత్రి పువ్వాడ,

ఎంపీ వద్దిరాజు

వైరా/మధిర: రైతులకు యూరియా ఇవ్వలేని స్థితిలో రాష్ట్రంలో పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. యూరియా, విత్తనాల కొనుగోళ్లతో పాటు పంట ఉత్పత్తుల అమ్మకానికి రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులు అరిగోస పెడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు, సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియ(ఎస్‌ఐఆర్‌)పై శ్రేణులకు అవగాహన కల్పించేందుకు వైరా, మధిరలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశాల్లో పువ్వాడ, రవిచంద్రతో పాటు ఎమ్మెల్సీలు తాతా మధు, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

హామీల అమలులో విఫలం

అధికారంలోకి రాకముందు లెక్కకు మించి హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు వాటిని అమలుచేయకుండా మాయమాటలతో కాలం వెళ్లదీస్తున్నారని అజయ్‌కుమార్‌, వద్దిరాజు విమర్శించారు. రైతులకు సకాలంలో యూరియా కూడా ఇవ్వలేకపోగా, యాప్‌ను ప్రవేశపెట్టడం సరికాదన్నారు. అంతేకాక రైతు రుణమాఫీ, భరోసా అమలులోనూ రాష్ట్రప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మధిర నియోజకవర్గంలో 100 శాతం రుణమాఫీ జరిగిన గ్రామం చూపించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు సవాల్‌ విసిరారు. కాగా, వైరా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త బీఆర్‌ఎస్‌ శ్రేణుల విషయంలో నోరుజారితే సహించేది లేదని పేర్కొన్నారు. అలాగే, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించాలని చూస్తున్న ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలని సూచించారు. ఇక సమగ్ర ఓటరు సవరణ పేరుతో రాష్ట్రంలో ఓట్లు తొలగించి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. కానీ రాష్ట్రమంతటా కేసీఆర్‌ తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నందున, ఏ ఒక్కరి ఓటు పోకుండా బీఆర్‌ఎస్‌ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈసమావేశాల్లో జెడ్పీ మాజీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, నాయకులు గుండాల కృష్ణ, వనమా విశ్వేశ్వరరావు, కట్టా కృష్ణార్జునరావు, లకావత్‌ గిరిబాబు, బాణోత్‌ మనీషా లక్ష్మి, బానోత్‌ బాలాజీ, బాణాల వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ, బొమ్మర్తి రామ్మూర్తి, షేక్‌ లాల్‌ అహ్మద్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement