సత్తుపల్లిటౌన్: మండలంలోని బుగ్గపాడు ఫుడ్‌పార్కులో భూ కేటాయింపులపై విమర్శలు వస్తున్నందున, ప్రభుత్వం నిగ్గు తేల్చాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావు డిమాండ్ చేశారు. సత్తుపల్లిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. తక్కువ ధరకే కేటాయించిన భూములు పరిశ్రమలు నిర్మించడానికా.. రియల్‌ఎస్టేట్ దందా కోసమా అన్న అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. అయితే, కేటాయింపులపై సమాధానం చెప్పాల్సిన మంత్రులు, ఎమ్మెల్యే వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. భూకేటాయింపులపై బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి కేంద్ర ఆహారభద్రత మంత్రికి నివేదిక ఇచ్చి సెంట్రల్ విజిలెన్స్ విచారణ కోరతారని తెలిపారు. కాగా, దేశంలో మోదీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తవగా, తెలంగాణ అభివృద్ధికి రూ.11 లక్షల కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పథకాలతో రూపొందించిన పుస్తకాలను రామలింగేశ్వరరావు విడుదల చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు, మండల, పట్టణ అధ్యక్షులు సాలి శివకృష్ణ, శివ, ప్రభాకర్‌రెడ్డి, నాయకులు నాగులు, సుబ్బారావు, బాలకృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు.


