సాగుకు ప్రతికూలమే..
కొన్ని మండలాల్లో ఆశాజనకంగా
వర్షపాతం
నైరుతి పూర్తిగా విస్తరించకున్నా సాగుకు రైతుల సై
వచ్చే నెల వర్షాలపైనే అన్నదాతల ఆశలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వేసవి పోయింది.. వానాకాలం వచ్చింది. నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో జిల్లాకు విస్తరించకున్నా ఇన్నాళ్లు నిప్పులు గక్కిన భానుడు కాస్త చల్లబడ్డాడు. పలు మండలాల్లో భారీ, మరికొన్ని మండలాల్లో తేలికపాటి వర్షాలతో రైతులు పత్తి, మిర్చి వంటి పంటల సాగుకు సై అంటున్నారు. ఈ నెల 1 నుంచి 20 వరకు జిల్లా సగటు వర్షపాతాన్ని పరిశీలిస్తే ఎక్కువగానే నమోదైంది. కానీ భిన్న వాతావరణం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 38 – 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండడంతో నాటిన విత్తు మొలకెత్తుతుందా, లేదా అన్న బెంగ పట్టుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో విత్తనాలు మొలకెత్తినా, పంట దిగుబడిపై ప్రభావం పడొద్దంటే వచ్చే నెల వర్షాలే కీలకంగా మారనున్నాయి.
సాధారణం కన్నా అధికమే..
ఏటా జూన్‌లో నైరుతి రుతుపవనాల ఆగమనంతో వర్షాలు మొదలువుతాయి. ఆ వెంటనే రైతులు దుక్కులు దున్ని పంటల సాగు చేపడతారు. ఈసారి జూన్ మూడో వారం దాటుతున్నా ఎండల ప్రభావం తగ్గలేదు. అయితే, ఈ నెల 20వ తేదీ వరకు సగటు సాధారణ వర్షపాతం 8.3 సెం.మీ.కు గాను 10.3 సెం.మీ.గా నమోదైంది. గత ఏడాది జూన్‌లో మాత్రం ఇది 12.3 సెం.మీ.గా ఉంది. ఈసారి అప్పుడప్పుడు కురుస్తున్న వర్షం సాగుకు ఏమాత్రం అనుకూలంగా లేకున్నా.. రైతులు భవిష్యత్‌పై ఆశతో పత్తి, మిర్చి విత్తనాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పలుచోట్ల విత్తనాలు మొలకెత్తక రెండోసారి కూడా నాటుతున్నారు.
13 మండలాల్లో జోరు
జిల్లాలోని 21 మండలాలకు గాను 13 మండలాల్లో ఈ నెల 20వ తేదీ నాటికి అధిక వర్షపాతం నమోదు కావడం విశేషం. అత్యధికంగా కల్లూరులో సాధారణ వర్షపాతం 8.5 సెం.మీ.కు గాను 19.4 సెం.మీ.గా నమోదైంది. ఏన్కూరులో 7.4, నేలకొండపల్లిలో 6.8, చింతకానిలో 6.3, తల్లాడలో 5.4 సె.మీ. వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా పడింది. ఇక సింగరేణి మండలంలో మాత్రం 8.8 సెం.మీ.కు గాను కేవలం 2.9 సెం.మీ., కామేపల్లి మండలంలో 8.7 సెం.మీ.కు గాను 6.6 సెం.మీ.గా నమోదైంది.
ఆశలు చిగురించాలని..
ఏటా జూన్‌లో వర్షాలు కురవడం ప్రారంభమై జూలై వచ్చేసరికి జోరందుకుంటాయి. అయితే ఈనెల వేడి, ఉక్క వాతావరణం కారణంగా ఇప్పుడు కురుస్తున్న వర్షాలు సాగుకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో పంటల సాగు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం కూడా తీవ్రంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోపక్క ఏటా మాదిరిగానే ఈ జూలైలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో రైతులు కూడా వచ్చేనెలపైనే ఆశలు పెట్టుకున్నారు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురిస్తే పత్తి, మిర్చి పంటలతోపాటు వరి సాగు కూడా ఉపందుకోనుంది. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎలా ఉన్నా.. పంటల సాగు ముందుకు సాగాలంటే జూలై నెలనే కీలకం కానుంది.
ఈనెల ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువగానే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు సాగుకు అనుకూలంగా లేవు. మృగశిర కార్తె ముగింపునకు వచ్చినా 40 డిగ్రీలకు తక్కువ కాకుండానే ఉష్ణోగ్రత నమోదవుతోంది. తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతుండగా, భూమిలో వేడి తగ్గలేదు. వర్షాకాలంలో ముసురు పడితేనే భూమి చల్లబడే అవకాశముంది. ఆ పరిస్థితి లేక కురిసిన కొద్దిపాటి వర్షం కూడా ఆవిరైపోతోంది. దీంతో రైతులు దుక్కులు దున్ని భారీ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు.


