పకడ్బందీగా ‘నీట్‌’ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ‘నీట్‌’

Jun 22 2026 12:42 AM | Updated on Jun 22 2026 12:42 AM

● కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ● ఉదయం 11గంటల నుంచే విద్యార్థులకు ప్రవేశం ● జిల్లాలో 88.45 శాతం హాజరు నమోదు

● కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ● ఉదయం 11గంటల నుంచే విద్యార్థులకు ప్రవేశం ● జిల్లాలో 88.45 శాతం హాజరు నమోదు

ఖమ్మం సహకారనగర్‌: వైద్య విద్య(యూజీ) కాలేజీల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన నీట్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. గతంలో పరీక్ష ఓసారి నిర్వహించి అవకతవకల కారణంగా రద్దు చేసిన విషయం విదితమే. దీంతో ఈసారి ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఈమేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ద్వారా నిర్వహించిన పరీక్షకు భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఖమ్మంలో ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా... దరఖాస్తు చేసుకున్న 2,771మంది విద్యార్థులకు గాను 2,451మంది(88.45శాతం) హాజరయ్యారని అధికారులు తెలిపారు.

11గంటల నుంచే అనుమతి

నీట్‌ మధ్యాహ్నం 2గంటల నుంచి 5–15గంటల వరకు నిర్వహించారు. అయితే, ఉదయం 11గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పడంతో చాలామంది ఆ సమయానికి కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల పత్రాలను పరిశీలిస్తూ, నిశితంగా తనిఖీ చేస్తూ లోనకు అనుమతించారు. అంతేకాక కేంద్రానికి వంద మీటర్ల దూరం వరకు ఎవరు ఉండకుండా పకడందీ చర్యలు చేపట్టారు.

మార్పు రావట్లే...

ఈసారి పరీక్షకు హాజరైన వారంతా రెండో సారి రాసిన విద్యార్థులే అయినా చాలామంది అధికారుల సూచనలు పట్టించుకోనట్లు కనిపించింది. కొందరు ఫొటోలు తీసుకురాకపోగా కేంద్రాల వద్ద నుంచి పరుగులు తీశారు. ఇంకొందరు చున్నీలు, హ్యాండ్‌బ్యాగ్‌లు, వాటర్‌ బాటిళ్లు, చెవి దిద్దులు, ఇతర ఆభరణాలతో వచ్చారు. దీంతో అవి తీసేయించాక లోనకు అనుమతించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement