ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 30న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యాన ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం రానున్నారని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్‌లో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు. డిప్యూటీ సీఎం సమీక్షలో పాల్గొనడంతో పాటు ఇతర ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రజలు కలెక్టరెట్‌కు రావొద్దని కలెక్టర్ ఓ ప్రకటనలో సూచించారు.
కామన్ స్కూల్
విద్యావిధానమే మేలు
ఖమ్మం సహకారనగర్: రాష్ట్రంలో రకరకాల పాఠశాలలు స్థాపించడం కాకుండా ఒకే విద్యావిధానం అమలు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్ కోరారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 27వేల పాఠశాలలు కాకుండా 4వేల పాఠశాలలే చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పడం గర్హనీయమని పేర్కొన్నారు. ఇకనైనా 15 వేలమంది రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలు విడుదల చేయడమే కాక ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, సీపీఎస్ ఉపాధ్యాయుల డీఏఈ బకాయిలు విడుదల చేయాలని కోరారు. అనంతరం పి.నాగిరెడ్డి, టీపీటీఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వి.మనోహర్‌రాజు మాట్లాడగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న గంధసిరి మల్లయ్యను అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ తీర్మానించారు. ప్రధాన కార్యదర్శి టి.వెంగళరావు, నాయకులు శ్యాంసుందర్, వీరబాబు, వెంకటేశ్వరరావు, ఉమాదేవి, నాగేశ్వరరావు, యాకూబ్ పాషా, కోటేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే, జిల్లా సైన్స్ అధికారిగా పనిచేసిన జగదీశ్వర్ మృతికి సంతాపం తెలిపారు.
ఐదు పోస్టాఫీసులు విలీనం
ఖమ్మంగాంధీచౌక్: ఆదాయానికి మించి నిర్వహణ వ్యయం జరుగుతున్న పోస్టాఫీసుల విలీనానికి అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఖమ్మం తపాలా డివిజన్ పరిధిలో ఐదు పోస్టాఫీసులను విలీనం చేశారు. ఈ జాబితాలో ఖమ్మం నగరంలో నాలుగు, కొత్తగూడెం టౌన్‌లో ఒక సబ్ పోస్టాఫీస్ ఉంది. ఖమ్మంలోని ట్రంక్ రోడ్, డాబాలబజార్ పోస్టాఫీసులను గాంధీచౌక్ పోస్టాఫీసులో, చర్చి రోడ్ పోస్టాఫీస్‌ను రిక్కాబజార్ (పాత బస్టాండ్ ఎదురుగా), ఎన్నెస్పీ క్యాంపు పోస్టాఫీస్‌ను ఖమ్మం హెడ్ పోస్టాఫీస్‌లలో విలీనం చేశారు. ఇక కొత్తగూడెం భజనమందిర్ ఏరియా పోస్టాఫీస్‌ను హెడ్ పోస్టాఫీస్‌లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇవికాక ఇంకొన్ని సబ్ పోస్టాఫీసులను సైతం విలీనం చేసే అవకాశముందని సమాచారం.


