ఊరూరా యోగా దినోత్సవం– 9లో
ఖమ్మం స్పోర్ట్స్: సంస్కృతికి ప్రతిరూపంగా నిలిచే యోగాను వారసత్వంగా చేసుకుని అంతా అనుసరించాల్సిన అవసరముందని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. యోగా దినోత్సవాన్ని ఆదివారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో హాజరైన యువతీ, యువకులు, కోచ్‌లతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గించేందుకు యోగా దోహదపడుతుందన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అందరూ రోజులో కొంత సమయం కేటాయించాలని సూచించారు. ప్రధానంగా యువత, విద్యార్థులు దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని తెలిపారు. డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో యోగాపై అవగాహన కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. జిల్లా ఆయుష్ శాఖ అధికారి కనకమహాలక్ష్మి, డాక్టర్ పద్మావతి, అనంత ప్రసాద్, వంజకుల లక్ష్మీనారాయణ, ఉమా మహేశ్వరరావు, భవాని, డీఎస్‌ఏ మేనేజర్ ఉదయ్‌కుమార్, కోచ్ ఎం.డీ.గౌస్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర టీ.ఎస్.


