ఇక్కడే అమ్మకాలు
క్లస్టర్ల వారీగా అందుబాటులో
రైతువేదికలు
ఇక్కడి నుంచే విత్తనాలు,
ఎరువుల అమ్మకానికి సన్నాహాలు
పంటల కొనుగోళ్లకు కూడా నిర్ణయం
రెవెన్యూ, పోలీసు శాఖల
సహకారం, సేవలు కూడా..
అన్నదాతలకు ప్రయోజనకరం
ఖమ్మంవ్యవసాయం: క్లస్టర్ల వారీగా నిర్మించిన రైతు వేదికలు వ్యవసాయ సమాచారం, సేవలకు కేంద్ర బిందువులుగా మారనున్నాయి. ఐదు వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా విభజించి ఒక్కో క్లస్టర్‌కు వ్యవసాయ విస్తరాణధికారి(ఏఈఓ)ని నియమించడమే కాక రైతు వేదికలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రతీ మండలంలో మూడు, నాలుగు గ్రామాలకు రైతు వేదికలు ఉన్నాయి. ఇన్నాళ్లు వీటిలో సమావేశాలు నిర్వహిస్తూ రైతులకు సబ్సిడీ పథకాలు, అర్హతలు, దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక రైతు భరోసా స్థితి, బీమా పథకాలు, వాతావరణం, మార్కెట్ ధరల సమాచారం కూడా లభిస్తోంది. ఈ సేవలను మరింత విస్తృతం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
సలహాలు ఇక్కడి నుంచే..
ప్రభుత్వం రైతులకు అందించే రైతు భరోసా, రైతు బీమా, సబ్సిడీపై యంత్ర పరికరాల పంపిణీ తది తర పథకాల అమలును ఇక్కడి నుంచే నిర్వహిస్తారు. ఇక పంటల సాగులో మెళకువలపై సలహా లు, వాతావరణ సూచనలను కూడా ఇదే వేదికల్లో సదస్సుల ద్వారా అందిస్తారు.
మార్కెటింగ్ సౌకర్యం..
రైతులు పండించిన పంటలను ప్రభుత్వ మద్దతు ధరతో విక్రయించుకునేందుకు కూడా ఈ వేదికల ద్వారా అవకాశం కల్పిస్తారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి, మార్క్‌ఫెడ్ ద్వారా అపరాలు, మొక్కజొన్న వంటి పంటల కొనుగోళ్లు ఇక్కడి నుంచే చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఏజెన్సీలు రైతు వేదికల్లో పంటలను కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంటుంది. దీంతో దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట పడే అవకాశముంది.
రెవెన్యూ, పోలీసు సేవలు
వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు ఎక్కువగా జరిగే గ్రామాల్లో కేంద్ర బిందువులుగా రైతు వేదికలు నిలుస్తున్నాయి. ఈ నేపథ్యాన రెవెన్యూ, పోలీసు శాఖల సేవలు కూడా ఇక్కడే లభించేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆయా శాఖల సిబ్బందిని వేదికల వద్ద అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 196..
ఉమ్మడి జిల్లాలో 196 రైతు వేదికలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 129, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 67 వేదికలు కొనసాగుతున్నాయి. వీటిలో ఏఈఓలను నియమించి రైతులకు సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 5.50 లక్షల మంది రైతులు సుమారు 11 లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యాన రైతు వేదికల ద్వారా సేవలు విస్తృతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
రైతులు అక్రమార్కుల బారిన పడకుండా అవసరమైన, సిఫారసు చేసిన విత్తనాలు, ఎరువులను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పలు వరి రకాల విత్తన మినీ కిట్లను ఇక్కడి నుంచే అందిస్తున్నారు. అలాగే, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రూపొందించే విత్తనాలను సహకార సంఘాల ద్వారా సబ్సిడీపై విక్రయిస్తుండగా, ఆయా సంఘాలు రైతు వేదికల ద్వారా అమ్మేలా శ్రీకారం చుట్టనున్నారు. ఇవికాక ఎరువుల విక్రయానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. గత సీజన్‌లో అమలుచేసిన ఈ విధానంతో సత్ఫలితాలు రాగా కొనసాగింపునకు ప్రభుత్వం నిర్ణయించింది.
రైతు వేదికల ద్వారా వ్యవసాయంపై సలహాలు ఇవ్వడమే కాక ఇతర సేవలను కూడా ఇక్కడి నుంచే అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సీజన్లకు అనుగుణంగా వేదికల ద్వారా అవసరమైన విత్తనాలు, ఎరువుల సరఫరా జరుగుతోంది. అంతేకాక పంట కొనుగోళ్లకు కూడా ఇవి వేదికలుగా నిలవనున్నాయి. –ధనసరి పుల్లయ్య,
జిల్లా వ్యవసాయాధికారి, ఖమ్మం


