ఇక సాగునీటి పరుగులు.. | - | Sakshi
Sakshi News home page

ఇక సాగునీటి పరుగులు..

Jun 22 2026 12:42 AM | Updated on Jun 22 2026 12:42 AM

‘చివరి’రైతుల ఇక్కట్లు తీరేలా..

ముమ్మరంగా సిరిపురం మేజర్‌ కాల్వ ఆధునికీకరణ పనులు

రూ.72 కోట్లతో లైనింగ్‌, పటిష్టత

ఫలితంగా చివరి భూములకు సైతం నీరందేలా చర్యలు

ఇన్నాళ్లు ఇబ్బంది పడ్డాం..

తీరనున్న కష్టాలు

తల్లాడ: నాలుగు దశాబ్దాలుగా తాత్కాలిక మరమ్మతులతోనే కాలం వెళ్లదీసిన నాగార్జునసాగర్‌ పరిధి సిరిపురం మేజర్‌ కాల్వ ఆధునికీకరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎన్నెస్పీ ఎడమ కాలువ పరిధిలో కల్లూరు డివిజన్‌లోనే మేజర్‌ కాల్వ ఇదే అయినా నిర్వహణ లోపంతో ఇబ్బందు లు ఎదురవుతున్నాయి. కాల్వ కట్టలు బలహీనంగా ఉండి, కనీసం 120 క్యూసెక్కుల నీరు విడుదల చేసి నా సాఫీగా సాగడం లేదు. దీంతో రూ.72 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం 170 క్యూసెక్కుల నీరు విడుదల చేసినా ఇబ్బంది రాకుండా పనులు చేయిస్తోంది. ఈ పనులు పూర్తయితే ఏన్కూరు మెయిన్‌ బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి ప్రారంభమయ్యే సిరిపురం మేజర్‌ కాల్వ వైరా మండలం సిరిపురం వరకు కొత్త రూపు దాల్చనుంది.

చకచకా పనులు

సిరిపురం మేజర్‌ కాల్వలో మూడు నెలల నుంచి ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. ఏన్కూరు రెగ్యులేటరీ వద్ద నుంచి గోదావరి జలాలు వైరా రిజర్వాయర్‌లోకి చేరడానికి కూడా వీలుండేలా ఆధునికీకరణ పనులు చేస్తున్నారు. కాల్వ ఎత్తు పెంచడంతో పాటు పూడిక తీయిస్తూ వెడల్పు చేస్తున్నారు. అంతేకాక కాల్వకు రెండు వైపులా సిమెంట్‌ లైనింగ్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కాల్వ వెడల్పు, కట్టల బలోపేతం పనులు పూర్తికాగా, లైనింగ్‌ పనులు కొనసాగుతున్నాయి.

ఏన్కూరు రెగ్యులేటరీ నుంచి

వైరా రిజర్వాయర్‌ వరకు

ఏన్కూరు మెయిన్‌ బ్రాంచ్‌ కెనాల్‌ వద్ద రెగ్యులేటరీ నుంచి సిరిపురం మేజర్‌ కాల్వ ప్రారంభమై 18 కి.మీ. పొడవు ఉంటుంది. ఈ మేజర్‌ పరిధిలో ప్రస్తుతం 11 వేల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. కాల్వ ఆధునికీకరణ అనంతరం ఆయకట్టు పెరిగే అవశాశం ఉంది. చివరి భూములకు నీరందడమే కాక అదనంగా కనీసం 20 శాతం భూములకు నీరు చేరుతుందని భావిస్తున్నారు. కాగా, ఈ మేజర్‌ కాల్వ పరిధిలో గోపాలపేట, అన్నారుగూడెం, మల్లారం, తల్లాడ 1, 2, తెలగవరం, కొడవటిమెట్ట, పినపాక, సిరిపురం మైనర్‌ కాల్వలు ఉన్నాయి.

ఈ కాల్వ ఆధునికీకరణ పనులు పూర్తయితే చివరి భూముల రైతుల కష్టాలు తీరనున్నాయి. కాల్వ పరిధిలోని చివరి భూములైన సిరిపురం, పినపాక గ్రామాల రైతులకు ఏనాడు నీరు సాఫీగా అందిన దాఖలాలు లేవు. ఇప్పుడు కాల్వ ఎత్తు పెంచి, కట్టలు పటిష్టం చేస్తున్నందున సామర్థ్యం మేర నీటి విడుదలకు అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఆయకట్టు అంతటికీ నీరు అందుతుంది. ఇన్నాళ్లు 170 క్యూసెక్కుల నీటికి బదులు కాల్వ కట్టల పరిస్థితి కారణంగా 120 క్యూసెక్కులే విడుదల చేస్తుండటంతో చివరి ఆయకట్టుకు నీరందక రైతులు పంటలను నష్టపోయారు. ఈ మేరకు 1981లో కాల్వలు నిర్మించినప్పటికీ ఏటా తాత్కాలిక మరమ్మతులతో కాలం వెళ్లదీశారు. ఇప్పుడు గోదావరి జలాలను వైరా రిజర్వాయర్‌లోకి చేర్చడం, మధిర, ఎర్రుపాలెంతో పాటు వైరా, తల్లాడ, ఏన్కూరు మండలాల రైతులకు సాగునీటి సరఫరా కోసం మేజర్‌ కాల్వ ఆధునికీకరణ పనులు చేపడుతుండడం విశేషం.

ఎన్నెస్పీ కాల్వ ద్వారా సాగునీరు అందక ఏటా ఇబ్బంది పడేవాళ్లం. రేయింబవళ్లు కాల్వ వెంట తిరిగినా పంటలకు నీరందలేదు. పూడిక పేరుకుపోతే మేమే సొంత ఖర్చులతో తీయించాం. ఇప్పుడు కాల్వ పనులు జరుగుతుండడంతో కష్టాలు తీరతాయి.

–బొడ్డు మల్లయ్య, రైతు, తల్లాడ

సిరిపురం మేజర్‌ ఆధునికీకరణ పనులతో ఆయకట్టు పరిధి రైతుల కష్టాలు తీరనున్నాయి. ఇన్నాళ్లు ఖరీఫ్‌, రబీలో సాగు నీటి ఇబ్బంది వచ్చేది. కాల్వల చుట్టూ తిరిగేవాళ్లం. ఇప్పుడు చేపట్టిన పనులు పూర్తయితే రెండు పంటలు సమృద్ధిగా పండుతాయి.

–మొక్కా వెంకటేశ్వర్లు, రైతు, తల్లాడ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement