చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి

Jun 22 2026 12:42 AM | Updated on Jun 22 2026 12:42 AM

తిరుమలాయపాలెం: మండలంలోని బచ్చోడులో ఈ నెల 19న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికి త్స పొందుతూ మృతి చెందాడు. కూసుమంచి మండలం గైగొల్లపల్లికి చెందిన కుమ్మరికుంట్ల పుల్లయ్య (48) విద్యుత్‌ మోటార్లు రిపేర్లు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన 19వ తేదీన మరిపెడ బంగ్లా నుంచి ఇంటికి వెళ్తుండగా బచ్చోడు సెంటర్‌లో ఎదురుగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన పుల్లయ్యకు ఖమ్మంలో చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. ఆయనకు భార్య రమాదేవి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదుతో తిరుమలాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

రైలులో గుర్తుతెలియని వృద్ధుడు..

ఖమ్మంక్రైం: కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం గుర్తుతెలియని వృద్ధుడి (85) మృతదేహన్ని జీఆర్‌పీ సిబ్బంది గుర్తించారు. దివ్యాంగుల బోగీలో ప్రయాణిస్తున్న సదరు వ్యక్తి మృతి చెందినట్లు ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో ఖమ్మంలో మృతదేహాన్ని జీఆర్పీ సిబ్బంది కిందకు దింపారు. అనంతరం అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించారు. కాగా, మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో రైళ్లలో భిక్షాటన చేస్తుంటాడని భావిస్తున్నారు.

ఇద్దరు డీలర్ల అరెస్ట్‌

రికార్డులకు మించి బియ్యం ఉండడంతో కేసు

కల్లూరురూరల్‌: ప్రభుత్వం చౌకదుకాణాల ద్వారా సరఫరా చేసే సన్నబియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్న డీలర్లు రాయల నాగేశ్వరరావు, మెరుగు వేలాద్రిని అరెస్ట్‌ చేసి శనివారం రిమాండ్‌కు తరలించినట్లు కల్లూరు ఎస్‌ఐ హరిత తెలిపారు. ఏప్రిల్‌ 24, 25వ తేదీల్లో పౌర సరఫరాల శాఖ అధికారులు కల్లూరు మండలంలోని పేరువంచ, ఖాన్‌ఖాన్‌పేట రేషన్‌ దుకాణాల్లో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పేరువంచ దుకాణంలో స్టాక్‌ రిజిస్టర్‌తో పోలిస్తే రూ.71,715 విలువైన 12.50 క్వింటాళ్ల బియ్యం అదనంగా ఉండడం, ఖాన్‌ఖాన్‌పేట దుకాణంలో రూ.3,67,545 విలువైన 64.01 క్వింటాళ్ల బియ్యం అదనంగా ఉన్నాయని గుర్తించారు. పౌరసరఫరాల శాఖ అధికారి వేము నరేశ్‌ ఫిర్యాదుతో డీలర్లు నాగేశ్వరరావు, వేలాద్రిని అరెస్ట్‌ చేసి సత్తుపల్లి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జూలై 23వ తేదీ వరకు రిమాండ్‌ విధించారని ఎస్‌ఐ హరిత వివరించారు.

అక్రమంగా టిప్పర్‌ సీజ్‌

కల్లూరురూరల్‌: అనుమతి లేకుండా ఏపీలోని కృష్ణా జిల్లా నుంచి ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్‌ను పోలీసులు ఆదివారం సీజ్‌ చేశారు. ఏపీలో టన్ను రూ.600 చొప్పున ఇసుక కొనుగోలు చేసి తెలంగాణలో రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు అమ్మొచ్చనే భావనతో పలువురు తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు కల్లూరు మండలం పెద్ద కోరుకొండికి ఇసుక తీసుకొచ్చిన టిప్పర్‌కు అనుమతి లేదని తేలడంతో టిప్పర్‌ సహా 25 టన్నుల ఇసుక సీజ్‌ చేయడమే కాక డ్రైవర్‌ నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ హరిత తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement