సత్తుపల్లి: మండలంలోని బుగ్గపాడు ఫుడ్‌పార్క్ భూకేటాయింపుల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలేనని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలు రుజువు చేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్ చేశారు. సత్తుపల్లిలో ఆదివారం ఆమె మాట్లాడుతూ.. ధైర్యం ఉంటే చర్చకు రావాలే తప్ప మంత్రి తుమ్మలపై తప్పుడు విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. చుట్టపు చూపుగా సత్తుపల్లికి వచ్చే సండ్ర పదేళ్లు ఒక్క పరిశ్రమను తీసుకురాకపోగా, కిష్టారంలో సైలోబంకర్ నిర్మించి అక్కడి ప్రజల ఉసురు తీస్తున్నారని ఆరోపించారు. ఆయిల్‌పామ్ రిఫైనరీ ఫ్యాక్టరీని బీఆర్‌ఎస్ నేతలు మంజూరు చేయించినా, తాము సీఎంను ఒప్పించి ఇంతకంటే తక్కువ ధరకు భూములు ఇప్పిస్తామని తెలిపారు. కాగా, కొందరు యూట్యూబ్, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టులు పెడుతున్నారని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాగమయి హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఎండీ రెహానాబేగం, నాయకులు బొంతు సుమలత, మట్టా దయానంద్, చల్లగుళ్ల నర్సింహారావు, తోట సుజలరాణి, ఎం.డీ.కమల్‌పాషా, హకీంపాషా, నారాయణవరపు శ్రీనివాసరావు, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, ఈశ్వర్, పింగళి సామేలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్
మట్టా రాగమయి దయానంద్


