రఘునాధపాలెం: మండలంలోని కొర్లబోడుతండా గ్రామపంచాయతీలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వీధిదీపాల మరమ్మతులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్మికుడు విద్యుదాఘాతానికి గురై స్తంభం పైనుంచి కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గ్రామపంచాయతీలో భూక్య భీమా పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా ఆదివారం గ్రామంలోని వీధిదీపాల మరమ్మతుల కోసం విద్యుత్ సరఫరాను నిలిపివేసి స్తంభాలెక్కి పనులు చేపట్టాడు. నాలుగు స్తంభాలపై మరమ్మతులు పూర్తి చేసిన అనంతరం ఐదో స్తంభం ఎక్కి పనిచేస్తున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో భీమా షాక్‌కు గురై పైనుంచి కిందపడ్డాడు. అక్కడే ఉన్న చంటి అనే యువకుడు సీపీఆర్ చేసి, స్థానికుల సాయంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరమ్మతుల కోసం విద్యుత్ సరఫరాను నిలిపివేసిన తర్వాత కూడా మళ్లీ విద్యుత్ సరఫరా కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారా? లేక సాంకేతిక లోపం వల్ల విద్యుత్ ప్రవహించిందా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భీమాను గ్రామ సర్పంచ్ చిన్నయ్యనాయక్, పంచాయతీ కార్యదర్శి రూపాదేవి, పంచాయతీ కార్మికుల సంఘం (ఏఐటీయూసీ) జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల మల్లయ్య, మండల నాయకులు పరామర్శించారు. వైద్యులను అడిగి భీమా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. భీమా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు వారు చెప్పారు.


