ఖమ్మం లీగల్: ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎం.నాగరాజు నియమితులయ్యారు. ఇక్కడ జిల్లా జడ్జిగా ఉన్న రాజగోపాల్ ఇటీవలే బదిలీ అయ్యారు. ఈ స్థానంలో వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న నాగరాజును నియమించారు. అలాగే, ఖమ్మం ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావును వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ నుంచి శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
శ్రీవారికి అభిషేకం,
నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున గర్భగుడిలోని స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని స్వామి వారి పాదాలకు అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి
ఎప్‌సెట్ కౌన్సెలింగ్
ఖమ్మం సహకారనగర్: ఇంజనీరింగ్ కళాశాలల ప్రవేశాలకు నిర్వహించిన ఎప్‌సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు మొదటి విడత కౌన్సిలింగ్ ఈనెల 22నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా తెలిపారు. ఖమ్మంలోని కళాశాల ఆడిటోరియంలో ఉదయం 9నుండి సాయంత్రం 6గంటల వరకు జరిగే ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్థులు స్లాట్ ఆధారంగా హాజరుకావాలని సూచించారు. ఈమేరకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ పత్రాలు, స్లాట్ బుకింగ్ ఫారం, ఎప్‌సెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డ్, పదో తరగతి, ఇంటర్ మెమోలు, ఇంటర్ టీసీ, 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆధాయ ధ్రువపత్రాలతో పాటు ఆధార్ కార్డు తీసుకురావాలని తెలిపారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఖమ్మం సహకారనగర్: అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాక ప్రజలు సంప్రదించేందుకు కలెక్టరేట్‌లో కంట్రో ల్ రూమ్‌ను ప్రారంభించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి సీ.హెచ్.రాంమూర్తి తెలిపారు. ఈమేరకు శనివారం కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించాక ఆయన మాట్లాడారు. ఈ కంట్రోల్ రూమ్‌లో 24గంటల పాటు మూడు షిఫ్టుల్లో ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అత్యవసర పరిస్థితుల సమాచారాన్ని ప్రజలు చేరవేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1077 లేదా 90632 11298 నంబర్‌కు ఫోన్ చేయొచ్చని పేర్కొన్నారు. అంతేకాక నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపైనా రైతులు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.
మధిర మినీ స్టేడియానికి రూ.5.50 కోట్లు
ఖమ్మం స్పోర్ట్స్: మధిరలోని మినీ స్టేడియంలో సౌకర్యాల కల్పనకు రూ.5.50 కోట్ల నిధులు మంజారయ్యాయి. ఇప్పటికే ప్రారంభమైన ఈ స్టేడియంలో ఇండోర్ క్రీడాంశాల శిక్షణకే అవకాశం ఉండగా, ఇతర క్రీడాకారులకు ఉపయోగపడడం లేదు. దీంతో క్రీడాభిమానుల విజ్ఞప్తితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.5.50 కోట్లు మంజూరు చేశారు. స్టేడియం కోసం కేటాయించిన 6.93 ఎకరాల స్థలంలో ఈ నిధులతో మరిన్ని క్రీడాంశాల శిక్షణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు అందాయి. ఈమేరకు ఆరు లేన్ల అథ్లెటిక్స్ ట్రాక్, క్రికెట్ నెట్లు, రెండు వాలీబాల్ కోర్టులు, ఖో–ఖో, కబడ్డీ కోర్టులు, ఫుట్‌బాల్ ఫీల్డ్, క్రీడాకారుల డార్మెటరీ, ఓపెన్ జిమ్‌తో పాటు బాత్‌రూంల నిర్మాణం చేపడతారు. తద్వారా భవిష్యత్‌లో మధిర వేదికగా రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడా పోటీల నిర్వహణకు వీలవుతుందని భావిస్తున్నారు.


