● ‘సర్’పై శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి ● మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మంసహకారనగర్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై కాంగ్రెస్ శ్రేణులు, బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ) అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మంలో శనివారం నిర్వహించిన బీఎల్‌ఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో సుమారు 3.26 లక్షల ఓట్లు ఉంటే, అందులో సగం కూడా మ్యాపింగ్ పూర్తికాలేదని పేర్కొన్నారు. ఇటీవల బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఓట్ల మ్యాపింగ్ సక్రమంగా జరగక అక్కడి కొన్ని పార్టీలు రాజకీయంగా నష్టపోయినట్లు తెలిసిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 50 శాతం ఓట్లు కూడా మ్యాపింగ్ కాకపోవడం ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. ఈ మేరకు ఇంటింటి పరిశీలన సందర్భంగా బీఎల్‌ఏలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తక్కువ ఓట్లతోనే గెలిచాం..
అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఎక్కువ శాతం ఓట్లతో గెలవలేదని, కేవలం మూడు శాతం ఓట్ల తేడాతోనే విజయం సాధించామని తుమ్మల వెల్లడించారు. సర్ నిర్వహణతో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఓ రాష్ట్రంలో సుమారు 90 లక్షల ఓట్లు తొలగించగా, అప్పీల్ చేసుకునేందుకు కేవలం 30 లక్షల మందికే అవకాశం కల్పించారని చెప్పారు. ఈ మేరకు ఓటర్ల జాబితా సక్రమంగా పరిశీలించకపోతే ఎన్నికల ఫలితాలు తారుమారు కావడమే కాక రాజకీయ సమీకరణాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని రాజకీయాల్లో కొనసాగాలంటే ఓటర్ల జాబితాపై పూర్తిస్థాయి పట్టు సాధించి, అర్హుల పేర్లు తొలగించకుండా చూడాలని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు నెల పాటు కష్టపడి ఓటర్ల జాబితా పరిశీలనలో నిమగ్నమైతే ఆశించిన పదవులు, ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు నూతి సత్యనారాయణ, నాగండ్ల దీపక్‌చౌదరి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, సుడా, మార్కెట్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, యరగర్ల హన్మంతరావుతో పాటు బాలసాని లక్ష్మీనారాయణ, పునుకొల్లు నీరజ, మానుకొండ రాధాకిశోర్ తదితరులు పాల్గొన్నారు.


