● ఎస్‌ఐఆర్, పార్టీ సభ్యత్వ నమోదు శిక్షణకు హాజరు ● వెల్లడించిన ఎమ్మెల్సీ మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర
సాక్షిప్రతినిధి, ఖమ్మం: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్), బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై ఈ నెల 24న సత్తుపల్లిలో నిర్వహించే శిక్షణకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు హాజరు కానున్నారని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వెల్లడించారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శనివారం వారు మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా వ్యవసాయం, సాగునీటి రంగాలకు పెద్దపీట వేసి రైతులను రాజులుగా చేస్తే.. నేటి సీఎం రేవంత్‌రెడ్డి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్సీ మధు ఆరోపించారు. నాడు భక్తరామదాసు ప్రాజెక్టును పూర్తి చేయించి పాలేరు నియోజకవర్గానికి నీరు అందించగా, సీతారామ ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేయించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏమీ చేయకపోగా, తాను రైతునని గొప్పలు చెప్పుకునే వ్యవసాయ శాఖ మంత్రికి రైతుల బాధలు పట్టడం లేదని తెలిపారు. ముగ్గురు మంత్రులున్నా కూడా ఉమ్మడి జిల్లాకు ఒరిగింది ఏమీ లేకపోగా, నాడు కేసీఆర్ హయాంలో చేసిన పనులన్నింటినీ ఆగమాగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే వెంకట వీరయ్య మాట్లాడుతూ.. సత్తుపల్లిలో ఈనెల 24న ఉదయం 10.30 గంటలకు మొదలయ్యే సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారని, పార్టీ నుంచి ఆహ్వానం అందిన వారే హాజరుకావాలని సూచించారు. సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, బొమ్మెర రామ్మూర్తి, ఉన్నం బ్రహ్మయ్య, బెల్లం వేణు పాల్గొన్నారు.


