● జిల్లా ఇన్‌చార్జ్ జడ్జి మహేష్‌నాథ్ ● లోక్ అదాలత్‌లో 4,963 కేసుల పరిష్కారం
ఖమ్మంలీగల్: కక్షిదారులు రాజీ పడడం ద్వారా ఉత్తమ పరిష్కారం లభిస్తుందని జిల్లా ఇన్‌చార్జ్ ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జీవీ.మహేష్‌నాథ్ తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో తొమ్మిది బెంచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ కేసులను పలువురు కక్షిదారులు పరస్పర రాజీ ద్వారా పరిష్కరించుకున్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తి మహేష్‌నాథ్ మాట్లాడుతూ.. రాజీ పడి కేసులు పరిష్కరించుకోవడం ద్వారా ఇరువర్గాలకు సమన్యాయం జరుగుతుందే తప్ప ఎవరూ ఓడిపోయినట్లు కాదన్నారు. తద్వారా సమయం ఆదా అవుతుందని తెలిపారు. అనంతరం కేసులు పరిష్కరించుకున్న కక్షిదారులకు పర్యావరణ పరిరణక్షలో భాగంగా మొక్కలు పంపిణీ చేశారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి పి.దేవీమానస లోక్ అదాలత్ నిర్వహణను పర్యవేక్షించగా, పలు న్యాయస్థానాల న్యాయాధికారులు, న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు.
రూ.3 కోట్లకు పైగా పరిహారం
జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా జిల్లా కోర్టుతో పాటు ఇతర కోర్టుల్లో అత్యధిక కేసుల పరిష్కారం కోసం కొద్దిరోజులుగా కక్షిదారులకు అవగాహన కల్పించారు. ఈక్రమాన శనివారం 4,963 కేసులు పరిష్కారయ్యాయి. ఇందులో సివిల్ కేసులు 16, క్రిమినల్ కేసులు 745, చెక్కు కేసులు 186, కుటుంబ తగాదా కేసులు 14 ఉన్నాయి. అలాగే, 42 మోటార్ ప్రమాద కేసులను పరిష్కరించగా ప్రమాద బాధితులకు రూ.1,98,21,325 పరిహారం లభించింది. అంతేకాక ఎస్‌టీసీ ఎన్‌ఐ యాక్ట్ కేసులు 1,534 పరిష్కరించి ఫిర్యాదుదారులకు రూ.4,61,859 పరిహారంతో పాటు 14,586 ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కారం కాగా బాధితులకు పరిహారంగా రూ.98,48,710 లభించింది.


