గాలివాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సం

Jun 21 2026 12:19 AM | Updated on Jun 21 2026 12:19 AM

పెనుబల్లి: మండలవ్యాప్తంగా శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలుల ధాటికి ఏళ్లనాటి వృక్షాలు సైతం నేలకొరిగాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకూలి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పెనుబల్లి, కుప్పెనకుంట్ల, ముత్తగూడెం గ్రామాలతోపాటు పలు గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. కుప్పెనకుంట్లలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పడిపోయింది. విద్యుత్‌ శాఖాధికారులు కొన్ని ప్రాంతాల్లో సరఫరాను పునరుద్ధరించారు. శనివారం విరిగిపోయిన స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేశారు.

ఆలయ ప్రతిష్ఠాపనకు రూ.లక్ష విరాళం

తల్లాడ: మండలంలోని గొల్లగూడెంలో నూతనంగా నిర్మించిన అభయాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ఠాపనకు గ్రామ సర్పంచ్‌ కోడూరి ఉమాదేవి – వీరకృష్ణ రూ.లక్ష విరాళం ప్రకటించారు. ఈ మేరకు నగదును శనివారం ఆయన ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఇస్నేపల్లి లక్ష్మణ్‌, విలాసాగరం శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, గుండ్ల వెంకటేశ్వర్లు, బీరెడ్డి మల్లారెడ్డి, బొడ్డు కృష్ణ, గుండ్ల జోగారావు, తిరుపతిరావు పాల్గొన్నారు.

లైన్‌మెన్‌పై ఫిర్యాదులు, విచారణ

తల్లాడ: మండలంలోని కుర్నవల్లి సబ్‌స్టేషన్‌ లైన్‌మెన్‌ యాకూబ్‌ అవినీతికి పాల్పడుతున్నాడని మద్దునూరుకు చెందిన రైతు అనుమోలు రామారావు ఇటీవల ఎన్పీడీసీఎల్‌ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం విజిలెన్స్‌ ఎస్‌ఐ లవన్‌కుమార్‌ మద్దునూరు, రంగాపురంల్లో వివరాలు సేకరించి రైతులతో మాట్లాడారు. ఈ మేరకు నివేదికను ఉన్నతాధికారులకు ఇస్తామని తెలిపారు.

రెండేళ్ల తర్వాత తెరుచుకున్న బండిపాడు పాఠశాల

కామేపల్లి: మండలంలోని రుక్కీతండా పంచాయతీ పరిధి బండిపాడు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు లేక కొన్నేళ్లుగా మూతపడింది. ఇటీవల సర్పంచ్‌ రమాదేవి, ఎంఈఓ వెంకట్‌ ఆధ్వర్యంలో కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయురాలు పి.జ్యోతి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత యూనిఫామ్‌, భోజనం, అల్పాహారం, పుస్తకాలు అందుతాయని తల్లిండ్రులకు అవగాహన కల్పించారు. దీంతో 10 మంది విద్యార్థులను చేర్పించగా రెండేళ్లుగా మూతపడిన బండిపాడు బడి తెరుచుకుంది. ఈ మేరకు పిల్లలకు తొలిరోజు పుస్తకాలు అందజేసి పాఠాలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పిట్ల రాములు, కార్యదర్శి ఎండీ ఫజల్‌, సీఆర్‌టీ ఎల్‌.చందూలాల్‌, వార్డు సభ్యులు గుగులోతు మంగ్యా, జి.కిషన్‌, గ్రామస్తులు జె.వెంకట్‌రామ్‌, లాల్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలి

కారేపల్లి: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి టి.రాంబాబు సూచించారు. కారేపల్లిలోని కేజీబీవీని శనివారం తనిఖీ చేసిన ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, కేజీబీవీ లోతట్టు ప్రాంతంలో ఉండడం, పక్కనే మద్దులవాగు ప్రవాహం ఆవరణలోకి చేరే అవకాశం ఉండడంతో ఎత్తుగా మొరం పోయించాలని ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ మల్లెల రవీంద్రప్రసాద్‌కు సూచించారు. అనంతరం మోడల్‌ స్కూల్‌, కారేపల్లి హైస్కూళ్లను పరిశీలించిన డీపీఓ ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేశారు. ఆ తర్వాత కారేపల్లిలోని ఓ కాలనీలో ఇటీవల మహిళకు డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కాలనీలో పారిశుద్ధ్య పనులను కూడా పరిశీలించి స్థానికులకు అవగాహన కల్పించారు. ఎంఈఓ దుగ్గిరాల జయరాజు, సర్పంచ్‌ మేదరి టోనీవీరప్రతాప్‌, గ్రామ కార్యదర్శి నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement