వాడవాడాలా యోగా కేంద్రాలు
ప్రతీ ఒక్కరూ
యోగా చేసేందుకు ఆసక్తి
మానసిక ప్రశాంతతకు దోహదమని అందరూ అదేబాట
ఖమ్మంస్పోర్ట్స్/సత్తుపల్లిటౌన్: యోగా.. ప్రస్తుతం అందరూ ఆచరించాలనుకుంటున్న ప్రత్యేక ప్రక్రియ. ప్రస్తుతం ఒత్తిడితో కూడుకున్న జీవనం.. ఇంటా, బయట అనేక సమస్యలతో సతమతం.. ఎన్నో సమస్యలకు యోగాతో చెక్ పెట్టవచ్చని, మానసికంగా ప్రశాంతంగా ఉండవచ్చనే ఆలోచనతో ఎక్కువ మంది యోగా బాటపడుతున్నారు. ఇంటికి ఒకరు యోగా కేంద్రానికి వెళ్తున్నారంటే ఎంతటి ప్రాధాన్యత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇబ్బడిముబ్బడిగా యోగా కేంద్రాలు ఎర్పడటంతో ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లయింది. యోగా క్రియల వల్ల మానవుని శరీరంలోని ప్రతి అవయవం చక్కగా పనిచేస్తుందని, ప్రతి అవయవానికి రక్త ప్రసరణ జరుగుతుందని, దీంతో ఎలాంటి వ్యాధులు రాకుండా కాపడుతుందని అందరూ విశ్వసిస్తున్నారు. యోగా ద్వారా ఇప్పటికే జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటినవారున్నారు. జిల్లా కేంద్రంలో ఒకే పతంజలి యోగా కేంద్రం ఉండేది. ప్రస్తుతం ప్రతి వీధి, మండల కేంద్రాల్లో యోగా కేంద్రాలు వెలిశాయి.
ఆన్‌లైన్‌లోనూ..
యోగా, ధ్యాన శిక్షణ తరగతులు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా మహిళలు ఈ యోగా తరగతుల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. శిక్షణ శిబిరాలకు వెళ్లలేని వారు ఇళ్లల్లోనే నిత్యం సాధన చేస్తూ ప్రయోజనాలు పొందుతున్నారు. నిత్యం యోగా అభ్యాసం వల్ల మనిషికి ఆరోగ్యం, శక్తి, తేజస్సు, చురుకుదనం లభిస్తుందని కోచ్‌లు చెబుతున్నారు. అంతేకాక ప్రస్తుత విద్యావిధానంలో విద్యార్థులు ఒత్తిడిని దూరం చేసేందుకు యోగా సాధన ఉపయోగపడుతోంది. కాగా, సత్తుపల్లిలో శ్రీరామకృష్ణ యోగా సమితి, శ్రీరామచంద్ర మిషన్, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ, బ్రహ్మకుమారీస్ సంస్థలు దశాబ్దాలుగా యోగా, ధ్యానంపై ఉచిత శిక్షణ ఇస్తున్నారు.
నేడు యోగా దినోత్సవం


