జిల్లాకు రూ.66 కోట్ల కేటాయింపు
రాయితీతో అమలుకు సన్నాహాలు
లబ్ధిదారుల గుర్తింపు ప్రారంభం
మండలాల వారీగా సంప్రదించాల్సిన అధికారుల సెల్‌నంబర్లు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఉద్యాన పథకాల అమలుకు ప్రభుత్వం రూ.66 కోట్లు కేటాయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు ఈ నిధులను వినియోగించాలని రాష్ట్ర ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ సంచాలకులు ఆదేశించారు. ఈ మేరకు జిల్లాకు మంజూరైన పథకాలు, నిధుల వివరాలను జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఎం.వీ.మధుసూదన్ వెల్లడించారు.
●తెలంగాణ స్టేట్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్
(టీజీఎంఐపీ)
ఈ ఏడాది మొదటి దశలో ఈ పథకం కింద 15,310 ఎకరాల లక్ష్యంగా రూ.2701.57 లక్షలు కేటాయించారు. ఆయిల్ పామ్, ఇతర ఉద్యాన పంటల్లో నీటి సౌకర్యం కోసం స్ప్రింకర్లు, రెయిన్ గన్స్ ఏర్పాటుకు ఈ నిధులు కేటాయిస్తూ, రాయితీ అమలు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, చిన్న, సన్న, బీసీ రైతులకు 80, ఇతర రైతులకు 70 శాతం సబ్సిడీ కల్పించారు. స్ప్రింక్లర్లకు ప్రతీ రైతుకు 65 శాతం సబ్సిడీ వర్తింపజేస్తారు. కాగా, ఈ ఏడాది నుంచి ‘ఆటోమేషన్ ద్వారా డ్రిప్‘ప్రవేశపెట్టారు. సెన్సార్లు, కంట్రోలర్లు, వాల్వ్‌ల సాయంతో మొబైల్ యాప్ ద్వారా రైతు ఎక్కడి నుంచైనా నీటి విడుడులకు అవకాశం ఉంటుంది.
●నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ (ఎన్‌ఎంఈఓ – ఓపీ)
ఈ పథకం కింద జిల్లాలో 14,500 ఎకరాల ఆయిల్ పామ్ సాగును విస్తరించేందుకు రూ. 3,217.93 లక్షలు కేటాయించారు. టీజీ ఆయిల్ ఫెడ్, గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్ సంస్థల ద్వారా పంట సాగు విస్తరిస్తారు. ఈ పథకం ద్వారా ఎకరాకు రూ.50,918 చొప్పున నాలుగేళ్ల వ్యవధిలో ఇస్తారు. నారు, నిర్వహణ, అంతర పంటలు, మైక్రో ఇరిగేషన్ ఖర్చులు కూడా ఇందులో ఉన్నాయి.
●సమగ్ర ఉద్యాన మిషన్ (ఎంఐడీహెచ్)
మామిడి, జామ, నిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, అరటి వంటి ఉద్యాన పంటల సాగు, మల్చింగ్, యాంత్రీకరణ పరికరాల కోసం పలు ఉద్యాన పథకాలు అమలు చేస్తారు. ఈ పథకాల అమలుకు ఈ ఏడాదికి రూ. 598.54 లక్షలు కేటాయించారు.
●పీఎం – రాష్ట్రీయ కృషి వికాస్ యోజన
(పీఎంఆర్‌కేవీవై)
ఈ పథకాన్ని ప్రధానంగా కూరగాయల సాగుకు వినియోగిస్తున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.15లక్షలు కేటాయించింది. తీగజాతి కూరగాయల సాగు కోసం శాశ్వత పందిళ్ల నిర్మాణానికి యూనిట్‌కు రూ.50 వేల సబ్సిడీతో 30 యూనిట్ల లక్ష్యంగా నిర్ణయించారు.
●స్టేట్ బ్యాంబూ మిషన్ (ఎస్‌బీఎం)
ప్రైవేట్ రంగంలో హై డెన్సిటీ వెదురు సాగు కోసం ఈ ఏడాది 65 ఎకరాలను లక్ష్యంగా నిర్దేశించారు. ఈ పథకం కింద రూ.9.36 లక్షలను కేటాయించారు. వెదురు రైతులకు సబ్సిడీ, సాంకేతిక మద్దతు అందిస్తారు.
●పట్టు పరిశ్రమ
మల్బరీ సాగు విస్తరణ, రీయరింగ్ షెడ్ల నిర్మాణం, షూట్ ఫీడింగ్ స్టాండ్లు ఏర్పాటుకు మొత్తం 100 ఎకరాలను లక్ష్యంగా నిర్దేశించారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం ప్రస్తుత సంవత్సరానికి రూ. 112.23 లక్షలను మంజూరు చేసింది. పట్టు రైతులకు ఇది అదనపు ఆదాయ మార్గం అవుతుంది.
ప్రభుత్వం నిధులు కేటాయించిన పథకాలను లబ్ధిదారుల గుర్తింపు, అమలు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన రైతులు తమ దరఖాస్తులను ఉద్యాన అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. తద్వారా అర్హుల ఎంపిక జరుగుతుంది. ఆసక్తి ఉన్న రైతులు మండలాల వారీగా పూర్తి వివరాలతో అధికారులను సంప్రదించి దరఖాస్తులు ఇవ్వొచ్చు.
–ఎంవీ మధుసూదన్,
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి
మండలాలు అధికారి సెల్ నంబర్
కూసుమంచి, ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి 89777 14104
ముదిగొండ, చింతకాని, బోనకల్, మధిర, ఎరుపాలెం 89777 14113
వైరా, కొణిజర్ల, కామేపల్లి, సింగరేణి, ఏన్కూరు 89777 14105
ఖమ్మంఅర్బన్, రఘునాథపాలెం, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి 89777 14103
సత్తుపల్లి, వేంసూరు 89777 14114


