రఘునాథపాలెం: మండలంలోని కోయచలకకు చెందిన కొమ్మినబోయిన హరికృష్ణ (26) నాలుగు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం ఆయన తన కుమార్తెలకు జ్యూస్ తీసుకొచ్చేందుకు రఘునాథపాలెం వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమాన ఓ పాఠశాల ఎదురు రోడ్డుపై పడగా, అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొట్టింది. ఈ మేరకు హరికృష్ణకు ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించగా శుక్రవారం పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆయనకు భార్యతో పాటు నాలుగేళ్ల లోపు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, బయటకు తీవ్రగాయాలు కాకున్నా అంతర్గత గాయాలతో హరికృష్ణ కోమాలోకి వెళ్లగా బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందినట్లు తెలిసింది.
అక్రమ వడ్డీ వ్యాపారం గుట్టురట్టు
ఖమ్మంఅర్బన్: అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ జనాన్ని మోసం చేస్తున్న ముఠాను గుర్తించి, ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపా రు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఖమ్మం వాసిరెడ్డి కళ్యాణ మండపం ఎదురుగా గల్లీ బజార్ ప్రాంతంలోని ఓ ఇంట్లో తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామానికి చెందిన కలెక్షన్ ఏజెంట్ కర్రి మణికంటరెడ్డి పట్టుబడ్డాడు. ఆయనను విచారించగా పలు ప్రాంతాల్లో పేదలకు అధిక వడ్డీకి సబ్బల్ల సత్యనారాయణరెడ్డి, కర్రి భామిరెడ్డి, సతి వంశీకృష్ణరెడ్డి అప్పులు ఇస్తుండగా తాను వసూలు చేస్తున్నానని బయటపెట్టాడు. దీంతో నిందితుడి నుంచి భూమారెడ్డి పేరుతో ఉన్న రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ప్రజలు అధిక వడ్డీకి రుణాలు తీసుకుని మోసపోవద్దని ఏసీపీ రమణమూర్తి ఓ ప్రకటనలో సూచించారు.
సిలిండర్లు, మద్యం బాటిళ్లు స్వాధీనం
సత్తుపల్లి: అనుమతి లేకుండా ఇంట్లో పెద్దసంఖ్యలో నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్లు, మద్యం బాటిళ్లను సత్తుపల్లి పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని బుగ్గపాడుకు చెందిన ధూబికుంట్ల వీర రాఘవులు ఇంట్లో ఆయన సోదరి కిరాణం షాపు నడిపిస్తుండగా ఆదాయం సరిపోక ఇతర మార్గాలపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఈ క్రమాన ఇటీవల గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ పెరగడంతో బయట నుంచి తీసుకొచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అంతేకాక మద్యం బాటిళ్లుకూడా విక్రయిస్తున్నారనే సమాచారంతో తనిఖీ చేయగా, 20 సిలిండర్లు, 750 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. దీంతో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీహరి తెలిపారు.


