తల్లాడ: మండలంలోని మల్లవరంలో పశువులను చోరీ చేస్తూ విక్రయిస్తున్న ముఠాను శనివారం తల్లాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ ఎన్.వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లవరం గ్రామ రైతులు పశువుల చోరీపై ఇటీవల ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆ గ్రామానికే చెందిన కటికి శ్రీకాంత్, చౌడా పవన్, దడిపల్లి కాళేశ్వర్‌రావు చెడు వ్యసనాలకు బానిసై గేదెలను దొంగిలించి కొత్తగూడెం వ్యాపారికి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి మధిర కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించామని, కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని ఎస్‌ఐ వెల్లడించారు.
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ
పలువురికి గాయాలు
భద్రాచలంటౌన్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శుక్రవారం పల్లెవెలుగు బస్సు, లారీ ఢీకొన్నాయి. లారీడ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ ప్రమా దంలో బస్సులోని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


