మధిర: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. మధిరలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రితో పాటు మహాప్రస్థానం, అండర్ డ్రెయినేజీ నిర్మాణ పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. తొలుత వంద పడకల ఆస్పత్రిలో తనిఖీ చేసిన అదనపు కలెక్టర్.. అందుతున్న వైద్యం, ఇతర వివరాలు ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. అనంతరం మహాప్రస్థానం, అండర్ డ్రెయినేజీ పనుల పురోగతిని పరిశీలించి నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత, కమిషనర్ సామ్యూల్ ఇజ్రాయిల్ బెనటిక్ పాల్, వైస్ చైర్మన్ కోనా ధనికుమార్, కౌన్సిలర్ ములకలపల్లి వినయ్‌కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు.
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఖమ్మం సహకారనగర్: వైద్య విద్య కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘నీట్’ ఈనెల 21వ తేదీన జరగనుండగా, ఏర్పాట్లు పూర్తిచేశామని పరీక్షల సిటీ కోఆర్డినేటర్ నరేంద్రకుమార్ తెలిపారు. ఖమ్మం నగర పరిధిలో ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 2,771మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వెల్లడించారు. ఇందులో బాలికలు 2,038, బాలురు 733మంది ఉన్నారని తెలిపారు. కాగా, పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2నుంచి 5–15గంటల వరకు జరగనుండగా, అభ్యర్థులను ఉదయం 11నుంచి 1–30గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.
నేడు జాతీయ లోక్ అదాలత్
ఖమ్మం లీగల్: జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి దేవీమానస తెలిపారు. ఖమ్మంలోని న్యాయ సేవాసదన్‌లో లోక్ అదాలత్‌ను జిల్లా ఇన్‌చార్జ్ ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జీ.వీ.మహేష్ నాథ్ ప్రారంభిస్తారని వెల్లడించారు. కేసుల సత్వర పరిష్కారానికి వివిధ బెంచ్‌లను ఏర్పాటు చేయగా, కక్షిదారులు సకాలంలో హాజరు కావాలని సూచించారు. రాజీ పడదగిన సివిల్, క్రిమినల్, మోటారు ప్రమాద, చెక్ కేసులతో పాటు ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించుకునే అవకాశముందని న్యాయమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు.
స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలంకరణతో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పాల్వంచ సమీపాన శ్రీ కనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారి ఆలయంలో శుక్రవారం అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు. అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.


