మరమ్మతులెప్పుడో..? | - | Sakshi
Sakshi News home page

మరమ్మతులెప్పుడో..?

Jun 20 2026 12:07 AM | Updated on Jun 20 2026 12:07 AM

● ప్రాజెక్ట్‌ గేట్లు లీకై వర్షాకాలంలో వృథాగా పోతున్న నీరు ● దశాబ్దకాలంగా మరమ్మతులు నిర్వహించని కేటీపీఎస్‌ అధికారులు ● రెండేళ్ల క్రితం నిధులు విడుదల.. ముందుకురాని కాంట్రాక్టర్లు ● చిన్న సమస్యేనని నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదానికి దారితీసే అవకాశం

నాలుగుసార్లు టెండర్లు పిలిచాం

‘కిన్నెరసాని’కి
● ప్రాజెక్ట్‌ గేట్లు లీకై వర్షాకాలంలో వృథాగా పోతున్న నీరు ● దశాబ్దకాలంగా మరమ్మతులు నిర్వహించని కేటీపీఎస్‌ అధికారులు ● రెండేళ్ల క్రితం నిధులు విడుదల.. ముందుకురాని కాంట్రాక్టర్లు ● చిన్న సమస్యేనని నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదానికి దారితీసే అవకాశం

పాల్వంచరూరల్‌: కిన్నెరసాని ప్రాజెక్ట్‌ గేట్లు మరమ్మతులకు నోచుకోవడంలేదు. నిధులు మంజూరై రెండేళ్లయినా, నాలుగు సార్లు టెండర్లు పిలిచినా ఫలితం కానరావడంలేదు. మరోవైపు వానాకాలం వచ్చేసింది. ప్రాజెక్ట్‌ గేట్ల వద్ద లీకేజీ కారణంగా ఏటా వర్షాకాలంలో జలాశయం నుంచి నీరు వృథాగా పోతోంది. మూడేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. చిన్న సమస్యే అని నిర్లక్ష్యం వహిస్తే పెను ప్రమాదానికి దారితీసే అవకాశం లేకపోలేదని రైతులు, సమీప గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. కేటీపీఎస్‌ అధికారులు జాప్యం వీడకపోతే పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రాజెక్ట్‌ పిల్లర్లు, గేట్ల రబ్బర్‌ సీల్స్‌ లీకవుతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.

పదేళ్లుగా మరమ్మతులు లేవ్‌..

ప్రాజెక్ట్‌ గేట్లకు నాలుగైదేళ్లకోసారి మరమ్మతులు నిర్వహించాల్సి ఉంది. కానీ పదేళ్లు గడిచినా రిపేరు చేయలేదు. దీంతో గేట్ల మద్య లీకులు ఏర్పడి నీరు బయటకు వృథాగా పోతోంది. రిజర్వాయర్‌లోని నీటిమట్టం 393 అడుగులు ఉంటేనే మరమ్మతులు సాధ్యమని, అంతకంటే ఎక్కువ ఉంటే పనులు చేపట్టలేమని అధికారులు చెబుతున్నారు. లీకేజీ ప్రమాదమేమి కాదని కేటీపీఎస్‌(జెన్‌కో) అధికారులు అంటున్నారు. రిజర్వాయర్‌లో నీటిమట్టం 400 అడుగులకు పెరిగినప్పుడు మాత్రమే లీకేజీతో నీరు బయటకు పోతోందని చెబుతున్నారు.

ప్రాజెక్ట్‌ గరిష్టస్థాయి నీటిమట్టం

407 అడుగులు

కిన్నెరసాని రిజర్వాయర్‌పై 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యంతో 13 క్రస్ట్‌ గేట్లతో 1962 ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టారు. 1972లో పూర్తిచేశారు. తొలుత ఇరిగేషన్‌శాఖ పర్యవేక్షించగా, 1998 ఏప్రిల్‌ 1 నుంచి జెన్‌కోకు అప్పగించారు. 2014లో రూ.60 లక్షలతో ప్రాజెక్ట్‌ 13 క్రస్ట్‌ గేట్లకు రూఫ్‌వే, సాకెట్లను మార్చారు. దీంతో ఇవి మరో పదేళ్ల వరకు మార్చాల్సిన పనిలేదు. కానీ 1, 4, 13వ నంబర్‌ గేట్ల మధ్య పిల్లర్లకు బీటలువారాయి. పిల్లర్ల మధ్య నీటి చెమ్మ అధికంగా కన్పిస్తోంది.

పారిశ్రామిక, సాగు, తాగునీటి అవసరాలకు...

కిన్నెరసాని జలాశయం నుంచి కేటీపీఎస్‌ విద్యుత్‌ ఉత్పత్తికి, ఎన్‌ఎండీసీ, నవభారత్‌, కర్మాగారాలకు నీరు సరఫరా చేస్తున్నారు. కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో తాగునీరు. పాల్వంచ మండలంలో 3 వేలు, బూర్గంపాడు మండలంలో 7 వేల ఎకరాలకు సాగునీరు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మరమ్మతులు చేపట్టకపోతే పారిశ్రామిక, సాగు, తాగునీటి అవసరాలకు కూడా సమస్య ఏర్పడే అవకాశం ఉంది.

రూ.1.90 కోట్లు మంజూరు

కిన్నెరసాని జలాశయం కరకట్ట పటిష్టతకు టీజీ జెన్‌ యాజమాన్యం రెండేళ్ల క్రితం రూ.1.90 కోట్లు మంజూరుచేసింది. వీటి వినియోగానికి పుణే నుంచి సెంట్రల్‌ వాటర్‌ పవర్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన బృందం అధ్యయనం చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ప్రాజెక్ట్‌ పరిశీలనకు రాలదు. పిల్లర్ల మరమ్మతులు, ఇతర పనులకు ఏడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ పథకం డ్రిప్‌ ఇరిగేషన్‌ కింద రూ.2 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపారు. కానీ ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు.

కిన్నెరసాని ప్రాజెక్ట్‌ గేట్ల సీల్స్‌ లీకవడంతో నీళ్లు స్వల్పంగా బయటకు వస్తున్నాయి. మరమ్మతుల విషయమై జెన్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధులు కూడా మంజూరయ్యాయి. జెన్‌కో యాజమాన్యం నాలుగుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందురావడంలేదు. జలాశయంలో ఇప్పుడు నీళ్లు అధికంగా ఉన్నందున్న టెండర్ల ప్రక్రియ పూర్తయినా మరమ్మతులు నిర్వహించడం సాధ్యంకాదు.

– ప్రభాకర్‌రావు, కేటీపీఎస్‌ 5వదశ సీఈ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement