● గిరిజన వసతిగృహాల్లో మూలనపడిన ‘స్టీమ్ కుకింగ్’ వ్యవస్థ ● నిర్వహణ లేక, గ్యాస్ మంట సరిపోక పక్కకు.. ● వంద లోపు విద్యార్థులు ఉంటే కష్టమంటున్న సిబ్బంది
ఖమ్మంమయూరిసెంటర్: గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు తక్కువ సమయాన, నాణ్యమైన భోజనం అందించేందుకు 2016లో సరఫరా చేసిన ఆవిరి వంట పాత్రలు (స్టీమ్ కుకింగ్ సిస్టమ్స్) ఖమ్మం జిల్లాలో పూర్తిగా మూలనపడ్డాయి. అప్పట్లో రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఆధునిక వంట సామాగ్రి ప్రస్తుతం వంటగదుల మూలన మగ్గుతోంది. ఇందుకు అధికారుల నిర్లక్ష్యంతో పాటు అనాలోచిత నిర్ణయాలు, సాంకేతిక లోపాలు కూడా ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
నిర్వహణ లేక..
ప్రభుత్వ వసతిగృహాల్లో ఏర్పాటు చేసే ఆర్వో వాటర్ ప్లాంట్లకు ఆరు నెలలకోసారి అవసరమైన నిర్వహణ, మరమ్మతు చేయిస్తారు. కానీ రూ.లక్షల విలువైన స్టీమ్ కుకింగ్ పాత్రలకు అధికారులు ఎలాంటి నిర్వహణ చేపట్టలేదు. దీంతో పైపులైన్లు లీకై నా, చిన్నపాటి సాంకేతిక లోపాలు తలెత్తినా స్థానికంగా మరమ్మతు చేయించే వారు కరువయ్యాడు. ప్రారంభంలో కొన్ని రోజులు వాడినా.. ఆ తర్వాత చిన్న మరమ్మతులను సాకుగా చూపిస్తూ పక్కన పడేశారు.
మంట సరిపోవడం లేదని...
ఆవిరి యంత్రాల పనితీరుపై వసతిగృహ సంక్షేమ అధికారులు, వంట సిబ్బంది చెబుతున్న అంశాలు విస్తుగొలుపుతున్నాయి. ఈ పాత్రల ద్వారా అన్నం, పప్పు ఉడకాలంటే గ్యాస్ స్టౌలతో వచ్చే మంట ఏ మాత్రం సరిపోవడం లేదని, కట్టెల మొద్దులు పెట్టి భారీగా మంట వేస్తేనే ఇవి ఆవిరిని అందుకోగలవని చెబుతుండడం గమనార్హం. కానీ కాలుష్య నియంత్రణలో భాగంగా వసతిగృహాల్లో కట్టెల వాడకాన్ని నిషేధించారు. ఇక గ్యాస్ సిలిండర్ల మంట సరిపోవడం లేదని ఆధునిక పాత్రలను పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది.
విద్యార్థుల సంఖ్య తగ్గిందంటూ..
ఈ ఆవిరి పాత్రల వ్యవస్థను అప్పట్లో 250 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న పెద్ద హాస్టళ్లలో సమకూర్చారు. కానీ కాలక్రమేణా జిల్లాలోని గిరిజన హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని చెబుతున్నారు. ఖమ్మం నగరంలో తప్ప జిల్లాలో ఎక్కడా 150 మందికి మించి సంఖ్య లేకపోవడంతో ఈ పాత్రల వంట చేయలేమని చేతులెత్తేశారు. తక్కువ మందికి ఈ భారీ ఆవిరి పాత్రల్లో వండటం సాధ్యం కాక పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా జిల్లా కేంద్రంలో 200 – 300 మంది విద్యార్థులు ఉన్న వసతిగృహాల్లోనూ పక్కన పడవేయడంతో తుప్పుపట్టి నిరుపయోగంగా మారాయి.


