ఎలాగైనా పట్టుకోవాలి..
● అర్ధరాత్రి తర్వాత చోరీలకు స్కెచ్ ● సోనోవిజన్‌లో దొంగతనం బిహార్ ముఠా పనే?
ఖమ్మంక్రైం: పోలీసులకు అనుమానం రాకుండా, ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా ఖమ్మంలోని సోనోవిజన్ షోరూంలో చోరీకి పాల్పడింది బీహార్ ముఠా అని గుర్తించినట్లు సమాచారం. ఈనెల 11వ తేదీ తెల్లవారుజామున ఖమ్మం జిల్లా కేంద్రంలోని సోనోవిజన్ షోరూమ్‌లో రూ.66లక్షల విలువైన సెల్‌ఫోన్లు, ఇతర సామగ్రిని చోరీ చేసిన నిందితులు కారులో పరారైన విషయం విదితమే. ఈ మేరకు బృందాలుగా విడిపోయి వెతుకుతున్న పోలీసులు పలు కీలక అంశాలను గుర్తించినట్లు తెలిసింది.
ఒక తోటకు ఒకేసారి
బిహార్ నుంచి వచ్చిన ముఠా సభ్యులు లాడ్జీలు, హోటళ్లలో ఉండకుండా తోటలను ఎంచుకున్న సమాచారం. ఈ మేరకు జిల్లాకు సరిహద్దుగా ఉన్న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలోని మామిడి తోటలను గుర్తించి పగలంతా అక్కడే గడిపేవారని సమాచారం. ఒకరిద్దరు మాత్రమే బయటకు వెళ్లి ఎక్కడ చోరీ చేయాలో రెక్కీ నిర్వహించేవారని తెలిసింది. అయితే, ఓ రోజుకు వెళ్లిన తోటకు మరో రోజు వెళ్లకుండా ఇంకో అడ్డా ఎంచుకునేవారని సమాచారం. ఈ క్రమాన తోటల్లో కాపలా ఉండేవారిని మచ్చిక చేసుకుని, పని కోసం వచ్చిన తమకు లాడ్జీల్లో ఉండే స్థోమత లేదని నమ్మబలికేవారని తెలిసింది. అంతేకాక ఏదైనా అవసరాలకు డిజిటల్ పేమెంట్ల ద్వారా కాకుండా నగదు రూపంలో చెల్లించేవారని సమాచారం. తొలుత విజయవాడ సోనోవిజన్ షోరూంలో చోరీకి యత్నించినా సాధ్యం కాక, ఖమ్మంలోని సోనోవిజన్ షోరూం వద్ద సెక్యూరిటీ గార్డులు లేరని నిర్ధారించుకుని రంగంలోకి దిగినట్లు పోలీసులు గుర్తించారని తెలిసింది. అలాగే, ఖమ్మం వచ్చే సమయంలోనూ టోల్ గేట్ మార్గాలు కాకుండా లింక్ రహదారులను ఎంచుకుని ఏపీ నుంచి వత్సవాయి, బోనకల్ మీదుగా వచ్చినట్లు సమాచారం.
ఖమ్మం జిల్లా కేంద్రం నడిబొడ్డున భారీ జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగింది. ఈమేరకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు అధికారులు విచారణ కోసంప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఈ బృందాలు తమ విచారణలో సోనోవిజన్ షోరూంలో చోరీ చేసింది బిహార్ ముఠాగా గుర్తించినట్లు తెలిసింది. సీసీ పుటేజీల్లోని వారి ముఖాల ద్వారా కూడా ప్రాథమికంగా అంచనాకు రావడంతో నిందితులను పట్టుకునేందుకు ఓ పోలీసు బృందం బీహార్ వెళ్లినట్లు సమాచారం. కాగా, చోరీకి పాల్పడింది బిహార్ ముఠాయేనన్న అనుమానంతో ‘సాక్షి’లోనూ కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.


