ముదిగొండ: మాటలు చెప్పడం కాకుండా ఆచరణలో చూపించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆదర్శంగా నిలిచాడు. ముదిగొండ మండలం యడవల్లికి చెందిన బాల నర్సింహారావు స్వగ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సొంత గ్రామంలోని బడి అభివృద్ధి చెందేలా పలువురు విద్యార్థులను చేర్పించారు. అంతేకాక కుమార్తె, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న బాల హరిణిని కూడా తాను పనిచేస్తున్న పాఠశాలలో చేర్పించగా, హెచ్‌ఎం నాగలక్ష్మి, తదితరులు అభినందించారు.
సర్పంచ్, వార్డు సభ్యురాలు కూడా..
నేలకొండపల్లి: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రచారం చేసే ప్రజాప్రతినిధులు తమ పిల్లలను కూడా చేర్పించారు. మండలంలోని నాచేపల్లి సర్పంచ్ భూక్యా మౌనిక కుమారుడు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. అయితే, బడిబాట ప్రచారంలో పాల్గొన్న ఆమె తన కుమారుడిని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. అంతేకాక వార్డు సభ్యురాలు కూరపాటి మాధవి కుమారుడు, కుమార్తెను సైతం పాఠశాలలో చేర్పించి తాము చెబుతున్న ఆదర్శాలను ఆచరణలో చాటిచెప్పారు. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యులను ఎంఈఓ బి.చలపతిరావు, హెచ్‌ఎం కోటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి బాబూరావు, ఉపాధ్యాయులు ఎం.వీరబాబు, చిన్నా తదితరులు అభినందించారు.
ప్రభుత్వ పాఠశాలలో కుమార్తెకు అడ్మిషన్


