ఇవే ఆ రకాలు...
న్యూస్‌రీల్
ఆ సన్నాల కోసం రైతుల తాపత్రయం
సరిపడా లభ్యత లేక పెరిగిన డిమాండ్
ఇదే అదునుగా ధరలు పెంచుతున్న వ్యాపారులు
శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2026
అన్ని పోలింగ్ బూత్‌ల్లో
బీఎల్‌ఓలు
ఏన్కూరు: ప్రత్యేక ఓటరు సవరణ(ఎస్‌ఐఆర్)లో భాగంగా ప్రతీ పోలీంగ్ బూత్ వద్ద బీఎల్‌ఓలు అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. ఏన్కూరు రైతువేదికలో సర్పంచ్‌లు, బీఎల్‌ఓ, బీఎల్‌ఏలకు గురువారం ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 25వ తేదీ నుంచి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మ్యాపింగ్ కాని వారి నుంచి ధ్రువపత్రాలు సేకరించాలని తెలిపారు. అంతేకాక మృతి చెందిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఇందుకోసం సర్పంచ్‌లు, పార్టీల బీఎల్‌ఏలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సీహెచ్.శేషగిరిరావు, ఎంపీడీఓ పల్లి భాగ్యశ్రీ పాల్గొన్నారు. కాగా, మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థుల కోసం వసతిగృహం ఏర్పాటుచేసినా మరమ్మతులు, సౌకర్యాల కల్పన పూర్తికాలేదని ప్రిన్సిపాల్ ఎం.సింహాచలం, అధ్యాపకులు సాంబశివరావు, కృష్ణార్జునరావు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంబంధిత అధికారులతో మాట్లాడతానని ఆమె తెలిపారు.
సిఫారసు చేసిన విత్తనాలు అందుబాటులో ఉంచాలి
ఖమ్మంవ్యవసాయం: రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన వరి సన్న రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) డీలర్లకు సూచించారు. ఖమ్మంలో పలు దుకాణాల్లో టాస్క్‌ఫోర్స్ బృందాలు తనిఖీ చేశాయి. ఈ సందర్బంగా వరి, పత్తి విత్తన నిల్వలు, రికార్డులను పరిశీలించాక డీఏఓ మాట్లాడారు. ప్రభుత్వం సిఫారసు చేస్తున్న బీపీటీ–5204, ఆర్‌ఎన్‌ఆర్–15048, డబ్ల్యూజీఎల్–44, జై శ్రీరాం, కూనారం సన్నాలు 1638 వంటి రకాలను అందుబాటులో ఉంచాలన్నారు. కాగా, రైతులు కూడా అరకొర వర్షాలకు కాకుండా సరైన పదును వచ్చాకే విత్తనాలు నాటాలని సూచించారు. ఖమ్మం అర్బన్ ఏఓ బి.కిషోర్‌బాబు, ఖమ్మం త్రీటౌన్ ఎస్సై సురేష్ పాల్గొన్నారు. అలాగే, ప్రభుత్వం వరిలో ఆరు సన్న రకాల సాగుపై నిర్ణయం తీసుకున్న నేపథ్యాన డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులతో డీఏఓ సమావేశమై సూచనలు చేశారు. ఏడీఏ వాసవీరాణి, ఏఓ కిషోర్‌బాబు, డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఆర్.మనోహర్‌రావు, పుల్లఖండం నాగేందర్, ప్రభాకర్‌చౌదరి, ఎం. పురుషోత్తం, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
చింతకానిలో
అత్యధిక వర్షపాతం
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈమేరకు చింతకాని మండలంలో అత్యధికంగా 8.64 సెం.మీల వర్షపాతం నమోదైంది. అలాగే, ముదిగొండ మండలంలో 4.94, బోనకల్ మండలంలో 3.82, ఖమ్మం రూరల్ మండలంలో 2.88, కల్లూరు మండలంలో 2.04, ఖమ్మం అర్బన్ మండలంలో 1.64, వైరా మండలంలో 1.42, నేలకొండపల్లి మండలంలో 1.36, తిరుమలాయపాలెం, కొణిజర్ల మండలాల్లో 1.34, పెనుబల్లి మండలంలో 1.02 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, తల్లాడ, మధిర, ఏన్కూరు, కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లోనూ వర్షప్రభావం కనిపించింది. మరో పక్క కారేపల్లి, సత్తుపల్లి, వేంసూరు, ఎర్రుపాలెం మండలాల్లో మాత్రం వర్షం జాడ లేకపోవడంతో ప్రజలు, రైతులు ఎదురుచూస్తున్నారు.
‘నీట్’ కేంద్రాల వద్ద బందోబస్తు
ఖమ్మంక్రైం: ఈనెల 21న ‘నీట్’ జరిగే కేంద్రాల వద్ద మధ్యాహ్నం 12నుంచి రాత్రి 7–15 గంటల వరకు ఆంక్షలు, బందోబస్తు అమల్లో ఉంటాయని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. ఈనేపథ్యాన కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపుగా ఉండొద్దని సూచించారు. అలాగే, సభలు, ర్యాలీలు, డీజేలతో ఉరేగింపులు, ధర్నాలకు అనుమతి ఉండదని తెలిపారు. అంతేకాక పరిసరాల్లోని ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేశారు. కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటుచేయడంతో పాటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూస్తామని తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ ఓ ప్రకటనలో హెచ్చరించారు.
ప్రభుత్వం నిర్ణయించిన సన్న వరి విత్తనాలు లభించడం లేదు. మేం బీపీటీ–5204 రకమే ఏటా సాగు చేస్తాం. ఈ ఏడాది మరో రకం వేద్దామని నిర్ణయించా. సిద్ది, కూనారం రకాల కోసం వెళ్తే లేవంటున్నారు. ఇంకొందరు ధర పెంచారు. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తుందని చూస్తున్నాం.
– నాగండ్ల వెంకటేశ్వర్లు, ఎదళ్లచెరువు
ప్రభుత్వ ప్రకటన నేపథ్యాన సన్న రకాల లభ్యతపై ఆరా తీస్తున్నాం. కంపెనీల డీలర్లతో సమావేశమై అవసరాల మేరకు విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశిస్తున్నాం. రైతులకు కావాల్సిన మేర విత్తనాలు అందుబాటులో తీసుకొస్తాం. ఎవరైనా ధరలు పెంచితే చర్యలు తప్పవు.
– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి
ఖమ్మంవ్యవసాయం: ప్రభుత్వం ప్రస్తుత వానాకాలంలో ఏడు వరి సన్న రకాలకు బోనస్ ప్రకటించింది. ఈ రకాలు సాగుచేస్తే క్వింటాకు ప్రభుత్వ మద్దతు ధర రూ.2,461తో పాటు రూ. 500 బోనస్ కూడా ఈ రకాలకే పరిమితం చేసింది. జిల్లాలో ఏటా వరి ప్రధాన పంటగా కొనసాగుతోంది. ఈ సీజన్‌లోనూ 3,20,301 ఎకరాల్లో రైతులు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఎకరానికి 25 కిలోల చొప్పున 8వేల టన్నుల వరకు విత్తనాలు అవసరమవుతాయి. కొందరు రైతులు గత సీజన్‌లో తాము పండించిన పంట నుంచే విత్తనాలు వినియోగించుకుంటారు. మిగతా వారు ప్రభుత్వం ప్రకటించిన రకాల కొనుగోలుకు విత్తనాభివృద్ది సంస్థతో పాటు ప్రైవేట్ డీలర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఆయా రకాలు సరిపడా లభ్యత లేక ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
తెగుళ్లు, కాలపరిమితి ఆధారంగా..
ప్రభుత్వం ప్రకటించిన వరి విత్తనాల్లో తమ భూములకు అనువైనవి ఎంపిక చేసుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. అంతేకాక తెగుళ్లను తట్టుకునే రకాలు, నీటి వనరుల ఆధారంగా కాల పరిమితిని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే, సన్న రకం అనగానే తొలుత బీపీటీ– 5204 గుర్తుకొస్తుంది. ఈ రకాన్ని రైతులు అనేక ఏళ్లుగా సాగు చేస్తున్నారు. ఇటీవల మరికొన్ని రకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
అన్నీ అరకొరగానే...
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల వద్ద లభ్యత తక్కువగా ఉన్న వరి సన్న రకాల విత్తనాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాలకు గాను జిల్లాలో బీపీటీ–5204 రకం విత్తనాలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. హెచ్‌ఎంటీ సోనా, ఆర్‌ఎన్‌ఆర్–15048, జై శ్రీరాం, కేఎన్‌ఎం–1638 రకాలు అరకొరగా లభిస్తున్నాయి. ఇక డబ్ల్యూజీఎల్–44(సిద్ది), కేఎన్‌ఎం–7715 రకాల లభ్యత లేదు.
ఇదే అదునుగా...
ప్రభుత్వం ప్రకటించిన సన్న వరి రకాల్లో లభ్యత తక్కువగా ఉండి, డిమాండ్ ఉన్న వాటి ధరలకు రెక్కలొచ్చాయి. డిమాండ్ దృష్ట్యా ప్రైవేట్ మార్కెట్‌లో డీలర్లు విత్తనాల ధర పెంచి విక్రయిస్తున్నారు. సాధారణంగా వరి సన్న రకాల 25 కిలోల విత్తన సంచి ధర రూ.1,020 నుంచి రూ.1,030 వరకు ఉంటుంది. ప్రస్తుతం లభ్యత తక్కువగా ఉన్న రకాలను వ్యాపారులు రూ.1,200 నుంచి రూ.1,300 వరకు విక్రయిస్తున్నారు. ఇంకొందరు మరింత డిమాండ్ పెరుగుతుందని, ఇంకా ధర పెంచొచ్చనే భావనలో బ్లాక్ చేస్తున్నట్లు సమాచారం. ఈక్రమాన రైతులు మాత్రం దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు.
బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం అర్హులైన బాలబాలికలు, స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఏ.ప్రమీల తెలిపారు. నూతన ఆవిష్కరణలు, అసాధారణ ప్రతిభ, క్రీడలు, కళలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్యసాహసాలు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు అందజేస్తారని పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై 31నాటికి 5నుంచి 18ఏళ్ల లోపు వయస్సు కలిగిన బాలబాలికలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. అలాగే, ఏడేళ్ల పైబడి బాలబాలికల సంక్షేమం, ప్రగతి కోసం కృషి చేస్తూ, వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన సంస్థలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు https:// awards.gov.in వెబ్‌సైట్ ద్వారా జూలై 31లోగా దరఖాస్తు చేసుకుని, ఆ కాపీలను కలెక్టరేట్‌లోని తమ కారాలయంలో అందజేయాలని డీడబ్ల్యూఓ ఓ ప్రకటనలో సూచించారు.
నేలకొండపల్లి: రాష్ట్రంలో రూ.750 కోట్ల నిధులతో నూతనంగా గోదాంల నిర్మాణాలు చేపడుతున్నామని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్‌లో గోదాంలను తనిఖీ చేసిన ఆయన రికార్డుల ఆధారంగా స్టాక్‌ను పరిశీలించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 50 కేంద్రాల్లో 7.50 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాంలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరో 25 కేంద్రాల్లో 2.50.లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాంలకు ప్రతిపాదించినట్లు చెప్పారు. అలాగే, హైదరాబాద్‌లో ప్రముఖ ఈ–కామర్స్ కంపెనీల కోసం రూ.70 కోట్లతో 23 ఎకరాల్లో గోదాంలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వెంకటాయపాలెంలో మిర్చి కోల్డ్ స్టోరేజీ నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని వెల్లడించారు. గోదాంలు అందుబాటులోకి వస్తే రైతులు పండించిన పంటల నిల్వ లకు ఇబ్బంది ఉండదని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో జరిగిన రైతు అవగాహన సదస్సులో నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పథకాలు అమలుచేస్తోందని చెప్పారు. అయితే, రైతులు సంప్రదాయ పంటలకు బదులు పంట మార్పిడితో ప్రయోజనాలు పొందాలని సూచించారు. సదస్సులో డీఏఓ డి.పుల్లయ్య, ఆత్మ పీడీ బి.సరిత, ఏడీఏ సతీష్ ప్రతినిధులు పాల్గొన్నారు.
●బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు హాస్యాస్పదంగా ఉందని రాయల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధిని ఓర్వలేక మంత్రులు మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. అభివృద్ధిని గుర్తించకుండా తప్పుడు ఆరోపణలు చేస్తే గుణపాఠం చెబుతామని పేర్కొన్నారు. మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు శాఖమూరి రమేష్, బచ్చలకూరి నాగరాజు, కొడాలి గోవిందరావు, జెర్రిపోతుల అంజిని, నల్లాని మల్లికార్జున్‌రావు, బొందయ్య, భద్రయ్య, కడియాల నరేష్ పాల్గొన్నారు.
గోదాంలో బియ్యాన్ని పరిశీలిస్తున్న
చైర్మన్ నాగేశ్వరరావు
బీపీటీ – 5204 (సాంబమసూరి)
ఆర్‌ఎన్‌ఆర్ – 15048
హెచ్‌ఎంటీ సోనా
జై శ్రీరాం
కేఎన్‌ఎం–1638 (కూనారం సన్నాలు)
డబ్ల్యూజీఎల్–44 (సిద్ది)
కేఎన్‌ఎం–7715 (కొత్త సన్నరకం)
ఏడు రకాల వరికి బోనస్ ప్రకటించిన ప్రభుత్వం


