ఖమ్మంసహకారనగర్: జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు భూసేకరణలో వేగం పెంచాలని ఆర్‌అండ్‌ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె.శివకుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై సమీక్షించారు. సీతారామ ఎత్తిపోతల పథకం, మున్నేరు–పాలేరు లింక్ కాలువతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు భూసేకరణ, అటవీ అనుమతులు, పరిహారం చెల్లింపులు, పెండింగ్ కేసులపై చర్చించాక శివకుమార్ మాట్లాడుతూ రైతులకు న్యాయమైన పరిహారం అందేలా పర్యవేక్షిస్తూ జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. అలాగే, ఇతర సమస్యలను రెవెన్యూ, నీటిపారుదల శాఖల మధ్య సమన్వయంతో పరిష్కరించుకోవాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, సీతారామ 14, 15, 16వ ప్యాకేజీల భూసేకరణ వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఇరిగేషన్ సీఈలు ఎం.వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, ఆర్‌డీఓ శ్రీనివాస్, ఎస్‌డీసీ సదానందం తదితరులు పాల్గొన్నారు.
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అనుమతి ఇవ్వొద్దు
లేఔట్లకు అనుమతులు జారీ చేసే సమయాన ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్), బఫర్ జోన్‌లో ఉందా అనేది సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి లేఔట్ కమిటీ సమావేశంలో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో దరఖాస్తులపై రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో చర్చించాక మాట్లాడారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని స్పష్టం చేశారు. ట్రైనీ కలెక్టర్ పారస్ కుమార్, ఎస్‌డీసీ సదానందం, ఇరిగేషన్ సీఈ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బీ, పీఆర్, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈలు యాకోబు, వెంకట్‌రెడ్డి, శ్రీనివాసాచారి, సుడా సీపీఓ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ఖమ్మంవ్యవసాయం: పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యతగా భావిస్తూ మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. వన మహోత్సవంలో భాగంగా గురువారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, జిల్లా అటవీ అధికారి అనూజ్ అగర్వాల్‌తో కలిసి కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటాక మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న వనమహోత్సవంలో అందరూ పాలుపంచుకోవాలని తెలిపారు. తొలుత సీఎం రేవంత్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా గుర్రంగుడ నుంచి వర్చువల్‌గా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అరణ్య పార్క్‌లను ప్రారంభించగా ప్రత్యక్ష ప్రసారాన్ని అధికారులు వీక్షించారు. డీఆర్‌డీఓ కె.శ్రీరామ్, డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి, ఆర్టీఓ సభ్యుడు జి.వెంకన్నతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ శివకుమార్


