పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనం అందజేయాలి | - | Sakshi
Sakshi News home page

పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనం అందజేయాలి

Jun 19 2026 12:30 AM | Updated on Jun 19 2026 12:30 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో సమగ్ర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు అమలుచేస్తున్న కార్యక్రమాల పరిశీలనకు జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వేముల నాగలక్ష్మి ఆధ్వర్యాన ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం గురువారం పర్యటించింది. ఈ సందర్భంగా 54వ డివిజన్‌లో ఎన్టీఆర్‌ పార్క్‌ను పరిశీలించి అందులో వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంపై అభినందించారు. అంతేకాక ఎన్నెస్పీ రోడ్డులో ఉన్న నర్సరీని పరిశీలించాక డంపింగ్‌ యార్డ్‌లో బయో – మైనింగ్‌ నిర్వహణ, డీఆర్సీసీ కేంద్రాల్లో పొడి చెత్త రీసైక్లింగ్‌ వివరాలు తెలుసుకున్నారు. ఈ బృందంలో ధర్మపురి చైర్‌పర్సన్‌ నాగలక్ష్మితో పాటు ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీరింగ్‌ మహేష్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ ఉండగా, వారికి ఖమ్మం మాజీ మేయర్‌ పి.నీరజ, డిప్యూటీ, అసిస్టెంట్‌ కమిషనర్లు కె.శ్రీనివాస్‌, అనిల్‌, హార్టికల్చర్‌ అధికారి బెల్లం రాధిక, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి, సౌకర్యాల కల్పనను వివరించారు.

రఘునాథపాలెం: విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో సిద్ధం చేసిన నాణ్యమైన భోజనమే అందించాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి మహమ్మద్‌ ముజాహిద్‌ ఆదేశించారు. రఘునాథపాలెంలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌లో గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం తయారీని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశాక మాట్లాడారు. భోజన పథకం నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు ఎం.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

ఖమ్మంమయూరిసెంటర్‌: మాదకద్రవ్యాల రహిత సమాజంతో పాటు బాలికలకు సురక్షితమైన సమాజాన్ని అందించేలా ప్రతీఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారి ఏ.ప్రమీల సూచించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గురువారం ఖమ్మం రైల్వేస్టేషన్‌, ఎన్నెస్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీడబ్ల్యూఓ ప్రమీల మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, లేనిపక్షంలో అనేక ఇబ్బందులు వస్తాయని తెలిపారు. అత్యవసర సాయం కోసం 1098(చైల్డ్‌ హెల్ప్‌లైన్‌), 181(మహిళా హెల్ప్‌లైన్‌), 112(ఎమర్జెన్సీ రెస్పాన్స్‌), 1930(సైబర్‌ క్రైమ్‌), 14567(దివ్యాంగుల హెల్ప్‌లైన్‌), 14446(నషా ముక్త్‌ భారత్‌ హెల్ప్‌లైన్‌) నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ రాజేంద్ర ప్రసాద్‌, ఆర్‌పీఎఫ్‌ సీఐ సురేష్‌గౌడ్‌, ప్రధానోపాధ్యాయురాలు దుర్గాభవాని, వివిధ విభాగాల ఉద్యోగులు ఎస్‌.డీ.సమ్రీన్‌, శ్రీనివాస్‌, జీ.ఎస్‌.ప్రమీల, మానసం, వేణుగోపాల్‌, బిందుప్రసాద్‌, సునీల్‌ పాల్గొన్నారు.

ఖమ్మంలో ధర్మపురి మున్సిపల్‌ బృందం పర్యటన

స్వీపర్‌ విధుల నుంచి దివ్యాంగురాలి తొలగింపు

వేంసూరు: కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేక ఐదేళ్ల నుంచి పాఠశాల స్వీపర్‌గా పనిచేస్తున్న దివ్యాగుంరాలిని ఈ ఏడాది తొలగించారు. మండలంలోని శంభునిగూడెంకు చెందిన బధిరురాలైన పెద్దలంక శారద స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదేళ్ల నుంచి స్వీపర్‌గా పనిచేస్తూ కుటుంబానికి బాసటగా నిలుస్తోంది. అయితే, ఈసారి ఆమెను విధుల్లోకి తీసుకోకుండా మరొకరిని నియమించారు. తమ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కల్లూరు సబ్‌ కలెక్టర్‌, విద్యాశాఖ అధికారులు స్పందించి శారదను తిరిగి పనిలోకి తీసుకోవాలని ఆమె తల్లి వెంకటనర్సమ్మ గురువారం కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement