● కిన్నెరసాని పర్యాటక కేంద్రాన్ని తీర్చిదిద్దుతాం ● ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
పాల్వంచరూరల్: విదేశీ పర్యాటకులు వచ్చేలా కిన్నెరసానిని తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పాల్వంచ మండలం కిన్నెరసానిలో వైల్డ్‌లైఫ్ శాఖ బయోసాట్ నిధులు రూ.45 లక్షలతో కొనుగోలు చేసిన జంగల్ సఫారీ టూర్ మూడు వాహనాలను గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని గుర్రంగూడ నుంచి వర్చవల్‌గా ప్రారంభించారు. అనంతరం భద్రాద్రి కలెక్టర్ అంకిత్, డీఎఫ్‌ఓ కృష్ణగౌడ్‌లతో కలిసి ఎమ్మెల్యే కూనంనేని పచ్చజెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. డీర్ పార్కు వద్ద మొక్కలను నాటి బటర్ ఫ్లై పార్కు, ఫీడ్ స్టోరేజీ భవనం, సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సఫారీ రైడ్, బటర్ ఫ్లై పార్కు, ట్రెక్కింగ్ అందుబాటులోకి రావడంతో కిన్నెరసానికి వచ్చే పర్యాటకులు సరికొత్త అనుభూతిని పొందుతారని అన్నారు. కొత్తగూడెం క్రాస్ రోడ్డులోని హరిత హోటల్‌ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. లక్నవరం తరహాలో కిన్నెరసానిలో కూడా తీగల వంతెన ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ అంకిత్ అన్నా రు. వనమహోత్సవంలో భాగంగా కిన్నెరసాని డీర్ పార్కులో ఆయన మొక్క నాటి మాట్లాడారు. పర్యావరణ సమత్యులతను కాపాడాలంటే విరివిగా మొక్కలను నాటాలన్నారు. అనంతరం కలెక్టర్ పర్యావరణ కేంద్ర భవనాన్ని, బటర్‌ఫ్లై పార్కును కలెక్టర్ అంకిత్ సందర్శించారు. జంతువులను బొమ్మలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కృష్ణాగౌడ్, విద్యాచందన, దారా ప్రసాద్, బి.బాబు, కిషన్, కొత్తగూడెం మేయర్ ఎం.గణేష్, కిన్నెరసాని సర్పంచ్ వజ్జ రామకృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్‌పాషా, వీసంశెట్టి పూర్ణచందర్‌రావు, ఉప్పుశెట్టి రాహుల్, డి.సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


