ఖమ్మంలీగల్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ బదిలీ అయ్యారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి బుధవారం ఉత్తర్వు లు జారీ అయ్యాయి. ఆయనను హైదరాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్)గా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మధ్యాహ్న భోజనంలో నాణ్యత తప్పనిసరి
నేలకొండపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి, మండల ప్రత్యేకాధికారి కె.రవిబాబు హెచ్చరించారు. మండలంలోని గువ్వలగూడెం ప్రభుత్వ పాఠశాలను బుధవారం తనిఖీ చేసిన ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నాణ్యత, మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఐఈఓ మాట్లాడుతూ వంట గదులు, పాత్రల శుభ్రత విషయంలో జాగ్రత్త వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఎంఈఓ బి.చలపతిరావు, సర్పంచ్ రావెళ్ల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
నేలకొండపల్లి: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యమని జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ కె.రాజశేఖర్ గౌడ్ తెలిపారు. మండల కేంద్రంలోని సీహెచ్‌సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ సేవలు, మందుల నిల్వల రికార్డులు తనిఖీ చేశాక వైద్యులు, ఉద్యోగులతో సమావేశమయ్యారు. అందరూ సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం అందించాలని సూచించారు. సీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ మంగళ, ఉద్యోగులు పాల్గొన్నారు.
పదేళ్ల తర్వాత
తెరుచుకున్న పాఠశాల !
పెనుబల్లి: గత పదేళ్ల క్రితం మూతపడిన ప్రభుత్వ పాఠశాల మళ్లీ ఈ ఏడాది తెరుచుకుని విద్యార్థులతో కళకళలాడుతోంది. మండలంలోని గంగదేవిపాడు గ్రామపంచాయతీ పరిధి చీన్యాతండాలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను దశాబ్ద కాలం క్రితం మూసివేశారు. దీంతో స్థానికులు కొందరు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు, ఇంకొందరు దూర ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. మరికొందరు ఏకంగా పిల్లలను బడి మాన్పించారు. దీంతో సర్పంచ్ మాలోతు రాధాకృష్ణ, ఉపసర్పంచ్ నాగులు, ఎంఈఓ కావేటి మోహన్ ఈసారి ఎలాగైన పాఠశాల తెరిపించాలనే లక్ష్యంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించగా పది మంది పిల్లలను చేర్పించేందుకు ముందుకొచ్చారు. ఈమేరకు బుధవారం పాఠశాలను తెరిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాధాకృష్ణ, ఎంఈఓ మోహన్‌లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యతో పాటుపుస్తకాలు, యూని ఫామ్, అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వైద్య శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు
ఖమ్మం వైద్యవిభాగం: జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న మూడు ల్యాబ్ టెక్నీషియన్, ఒక ల్యాబ్ సూపర్‌వైజర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు డీఎంహెచ్‌ఓ రామారావు తెలిపారు. కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనుండగా, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు ఇంటర్మీడియట్‌తో పాటు డీఎంఎల్‌టీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొన్నారు. అలాగే, సూపర్‌వైజర్ పోస్టుకు మెడికల్ లేబరేటరీలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 22 తేదీలోగా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.


