చింతకాని: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 26న జిల్లా పర్యటనకు వచ్చే అవకాశముందని సమాచారం. ఈమేరకు చింతకాని మండలంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని, రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రైతుభరోసా నిధులు విడుదల చేస్తారని తెలిసింది. ఈ విషయమై అందిన సమాచారంతో సభ నిర్వహణకు అనువైన స్థలం ఎంపిక చేసేందుకు అధికారులు, నాయకులు కసరత్తు మొదలుపెట్టారు. మండలంలోని లచ్చగూడెం, జగన్నాథపురం, రామకృష్ణాపురం గ్రామాల్లో బుధవారం వారు పరిశీలించారు. సభావేదిక నిర్మాణం, ఇతర అవసరాలకు సరి పడా స్థలాలపై ఆరా తీశారు. మత్కేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వర్లు, తహసీల్థార్ బాబ్జీప్రసాద్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎస్‌ఐ నరేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కన్నెబోయిన గోపి, నాయకులు పాల్గొన్నారు.


