19 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలి | - | Sakshi
Sakshi News home page

19 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలి

Jun 17 2026 12:16 AM | Updated on Jun 17 2026 12:16 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: రాబోయే నోటిఫికేషన్‌లో కేవలం 5 వేల పోలీస్‌ ఉద్యోగాలే కాకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19 వేల పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగ హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు పాలకూరి అశోక్‌ కోరారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన పలువురు అభ్యర్థులతో కలిసి కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌, సీపీ సునీత్‌దత్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం అశోక్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 19 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని డీజీపీ ప్రకటించగా, ప్రభుత్వం కేవలం 5 వేల ఉద్యోగాల భర్తీకే సిద్ధం కావడం సరికాదన్నారు. నాలుగేళ్లుగా నోటిఫికేషన్లు లేక పలువురి వయోపరిమితి దాటే పరిస్థితి ఉన్నందున మొత్తం పోస్టులు భర్తీ చేయడమే కాక కానిస్టేబుల్‌ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 36 ఏళ్లకు, ఎస్‌ఐ అభ్యర్థుల వయోపరిమితిని 38 ఏళ్లకు పెంచాలని డిమాండ్‌ చేశారు. అలాగే, లాంగ్‌ జంప్‌ పరిమితిని 3.8 మీటర్లకు తగ్గించాలన్నారు. అంతేకాక గ్రూప్‌–1, 2, 3 ఉద్యోగాలను వేగంగా భర్తీ చేయడంతో పాటు డీఎస్సీ ద్వారా 25 వేల టీచర్‌ పోస్టులు, విద్యుత్‌ రంగంలో ఖాళీగా ఉన్న 5 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గుడిగండ్ల వెంకటేశ్‌, కృష్ణ, అశోక్‌, భీమారావు, గోపాల్‌, బదిసా, సంపత్‌, రమేశ్‌, నవీన్‌, లోకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌, సీపీలకు

నిరుద్యోగ హక్కుల వేదిక వినతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement