అన్నింటికీ హాజరైన మంత్రి పొంగులేటి
పలు సమస్యలపై 25 వేల దరఖాస్తులు
పరిష్కారానికి క్లస్టర్ల వారీగా
అధికారుల నియామకం
అత్యధికం ఇళ్ల కోసమే..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్ ప్రజాసమస్యల పరిష్కారానికి వేదికగా మారింది. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాల్లో ప్రజల సమస్యలను నేరుగా వినడంతోపాటు పరిష్కారంపై అధికారులకు సూచనలు చేశారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా పాలేరు నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లుగా విభజించి ఈ కార్యక్రమాలు నిర్వహించగా, అందిన దరఖాస్తుల పరిశీలన, పరిష్కారానికి క్లస్టర్‌కు ముగ్గురు చొప్పున అధికారులను ప్రత్యేకంగా నియమించారు.
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా..
ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 25న నేలకొండపల్లి మండలం రాయగూడెం, తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామాల్లో ఈ కార్యక్రమం మొదలైంది. నియోజకవర్గంలోని 14 క్లస్టర్లలో రెండు నెలల్లో ఈ కార్యక్రమం ముగియగా, చివరి ప్రజాదర్బార్ ఈ నెల 8న ఏదులాపురం మున్సిపాలిటీలో జరిగింది. ఈ సందర్భంగా ప్రతీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొని సుమారు 45 వేల మంది సమస్యలను తెలుసుకున్నారు. చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా.. మిగిలినవి తీవ్రత ఆధారంగా నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా లక్ష్యాన్ని నిర్దేశించారు.
రెవెన్యూ సమస్యలపై కసరత్తు
ఇందిరమ్మ ఇళ్లతోపాటు రెవెన్యూ సమస్యల పరిష్కారంపైనా అధికారులు దృష్టి పెట్టారు. రెవెన్యూ అంశాలపై అందిన 4 వేల దరఖాస్తుల్లో భూభారతి, సాదాబైనామాలకు సంబంధించినవి ఉన్నాయి. పీఓటీ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ – అసైన్డ్ భూముల బదిలీల నిషేధ చట్టం)పై 800 దరఖాస్తులు అందాయి. ఆర్‌ఎస్‌ఆర్ (రీ సర్వే సెటిల్‌మెంట్ రిజిస్టర్) ఎక్స్‌టెంట్‌లో సమస్యల వల్ల భూవిస్తీర్ణం భూభారతిలో నమోదు కావడం లేదు. దీని పరిష్కారానికి క్షేత్రస్థాయిలో భూముల రీ సర్వే కోసం ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాకు 70 గ్రామాలను ఎంపిక చేసి డిజిటల్ భూ సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో 3,500 ఎకరాల్లో రీ సర్వే పూర్తి చేయగా.. మిగతా చోట్ల కూడా నిర్వహించి భూసమస్యలకు పరిష్కారం చూపిస్తారు.
పాలేరు నియోజకవర్గంలోని 14 క్లస్టర్లలో నిర్వహణ
ప్రజాదర్బార్‌లో ప్రజలు 25 వేల దరఖాస్తులను అందజేశారు. ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 9,731 ఉండగా, పెన్షన్ల కోసం 4,700 మంది, భూ సమస్యలపై 4 వేల మంది, గృహజ్యోతి పథకం కోసం 900 మంది, ఉపాధి హామీ జాబ్‌కార్డుల కోసం 600 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటితో పాటు మిగతా అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నెలరోజుల్లో పాలేరు నియోజకవర్గ పరిధిలో భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది. వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తిస్తూ, సంబంధిత పథకాలు ఎప్పుడు మొదలైతే అప్పుడు దరఖాస్తు దారులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.


