లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

Jun 17 2026 12:16 AM | Updated on Jun 17 2026 12:16 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్‌

ఖమ్మంలీగల్‌: ఈనెల 20న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్‌ సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.దేవివీమానస ఆధ్వర్యాన మంగళవారం బ్యాంకర్లు, చిట్‌ఫండ్‌ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాజడ్జి మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించడమే లక్ష్యంగా కక్షిదారులు ముందుకు రావాలని తెలిపారు. లోక్‌ అదాలత్‌లో రాజీ కుదిరే కేసులపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉండదని వెల్లడించారు. ఈసమావేశంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వై.రమేష్‌, బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ ఎం.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

రేపు బీఏఎస్‌ విద్యార్థుల ఎంపిక

ఖమ్మంమయూరిసెంటర్‌: షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ద్వారా నిర్వహిస్తున్న బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల(బీఏఎస్‌) పథకానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఎంపిక ఈనెల 18న నిర్వహించనున్నట్లు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ డీడీ జి.జ్యోతి తెలిపారు. ఉదయం 11గంటలకు 1వ తరగతి(డే స్కాలర్‌), మధ్యాహ్నం రెండు గంటలకు 5వ తరగతి (రెసిడెన్షియల్‌) విద్యార్థుల ఎంపికకు లాటరీ ఉంటుందని వెల్లడించారు. కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరు కావాలని సూచించారు.

క్యాంపెయిన్‌ను

విజయవంతం చేయాలి

ఖమ్మం వైద్యవిభాగం: ‘స్టాప్‌ డయోరియా’ పేరిట చేపట్టే క్యాంపెయిన్‌ను విజయవంతం చేయాలని డీఎంహెచ్‌ఓ రామారావు సూచించారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన ఆశ నోడల్‌ ఆఫీసర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆశా కార్యకర్తలందరూ చురుగ్గా పాల్గొంటూ గ్రామాలు, వార్డుల్లో పారిశుద్ధ్యం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఓఆర్‌ఎస్‌ ద్రావణం వినియోగం, జింక్‌ మాత్రల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అలగే, ఈనెల 28, 29, 30వ తేదీల్లో పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగంగా 0–5 ఏళ్ల వయస్సు గల ప్రతీ చిన్నారికి చుక్కల మందు వేయాలని సూచించారు. అంతేకాక వచ్చేనెల 13న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలు అందేలా శ్రద్ధ వహించాలని తెలిపారు. అనంతరం శ్రీనివాస్‌ నగర్‌ యూపీహెచ్‌సీని డీఎంహెచ్‌ఓ తనిఖీ చేసి ఆరోగ్య సేవలపై సమీక్షించారు.

ఇన్‌చార్జి డీఈఓగా సదానందం

ఖమ్మం సహకారనగర్‌: జిల్లా విద్యాశాఖాధికారి చైతన్యజైనీ 60రోజుల పాటు సెలవులో వెళ్లడంతో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (ఎల్‌ఏ) జి.సదానందంకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు చైతన్యజైనీ విధుల్లో చేరేవరకు సదానందం పూర్తి బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.52.95లక్షలు

ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. ఈమేరకు 92 రోజులకు గాను రూ.52,95,430 ఆదాయం నమోదైందని ఈఓ జగన్‌మోహన్‌రావు తెలిపారు. లెక్కింపులో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప ప్రధాన అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌తో పాటు శ్రీసత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement