ఖమ్మంమయూరిసెంటర్: బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల (బీఏఎస్) పథకం ద్వారా జిల్లాలోని పలు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కొత్త విద్యాసంవత్సరం మొదలై రెండు రోజులైనా అనుమతించకపోవడం ఇందుకు కారణమైంది. పథకం ఈ విద్యా సంవత్సరం లేదనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని ఓ పాఠశాల యాజమాన్యం ఏకంగా వాట్సప్ ద్వారా మెసేజ్ పంపించడం గమనార్హం. ఏటా ఇలానే వేధిస్తున్నందున ప్రభుత్వం స్పందించి పిల్లల భవిష్యత్‌ను కాపాడాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎస్సీ డీడీ జి.జ్యోతిని వివరణ కోరగా.. బీఏఎస్ పథకం కొనసాగుతున్న పాఠశాలల యాజమాన్యాలతో ఇప్పటికే సమావేశమై పిల్లలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే పాఠశాల గుర్తింపు రద్దుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిపారు. మరోమారు పరిశీలించి విద్యార్థులకు ఇబ్బంది రాకుండా చూస్తామని వెల్లడించారు.
కొనసాగిన
బస్సుల తనిఖీలు
ఖమ్మంక్రైం: ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోని ప్రైవేట్ పాఠశాలల బస్సుల గుర్తింపునకు రవాణా శాఖ అధికారులు రెండో రోజైన మంగళవారం కూడా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా తిరుగుతున్న మూడు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రెండు బస్సులను గుర్తించి కేసు నమోదు చేశా మని జిల్లా ఇన్‌చార్జ్ రవాణాశాఖాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఇకనైనా పాఠశాలల యాజమాన్యాలు అన్ని బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని, లేనిపక్షంలో సీజ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఫార్మర్ రిజిస్ట్రీ
పూర్తి చేయాలి
కూసుమంచి: రైతుల వివరాల నమోదుకు చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీని నూరుశాతం పూర్తి చేయా లని జిల్లా వ్యవసాయశాఖ అధికారి డి.పుల్లయ్య సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ, యాప్ తదితర అంశాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఆయన కూసుమంచిలోని రైతువేదిక నుంచి హాజరయ్యారు. అనంతరం శాఖ అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఫార్మర్ రిజిస్ట్రీపై దృష్టి సారించడమే కాక రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఆ తర్వాత పాలేరులోని ఎరువుల దుకాణాలను డీఏఓ తనిఖీ చేశారు. ఆత్మ పీడీ సరిత, కూసుమంచి ఏడీఏ సతీశ్, ఏఓ వాణి, ఏఈఓలు పాల్గొన్నారు.
యువకుడిపై
పోక్సో కేసు
ఖమ్మంక్రైం: బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఓ యువకుడిపై ఖమ్మం త్రీటౌన్ పోలీసులు మంగళవారం పోక్సో కేసు నమోదు చేశారు. ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్ ప్రాంతానికి చెందిన డిగ్రీ చదివే యువకుడు అదే ప్రాంతానికి చెందిన బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె కుటుంబీకుల ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇంట్లో చోరీకి
యత్నం
ఖమ్మంక్రైం: ఖమ్మంలోని డీమార్ట్ సమీపాన ముగ్గురు వ్యక్తులు మంగళవారం ఓ ఇంట్లో చోరీకి యత్నించారు. ఇద్దరు మహిళలతో పాటు మరో వ్యక్తి గడ్డ పారతో ఇంటి గొడను పగులకొడుతుండగా ఆ మార్గంలో వెళ్తున్న ఆటోడ్రైవర్, ఆయన స్నేహితుడు అడ్డుకోబోగా వారిపై దాడికి యత్నించారు. దీంతో వారు కేకలు వేయడంతో స్థానికులు చేరుకోగా ఓ మహిళ పట్టుబడగా త్రీటౌన్ పోలీసులకు అప్పగించారు.


