తీరు మారదా ?! | - | Sakshi
Sakshi News home page

తీరు మారదా ?!

Jun 17 2026 12:10 AM | Updated on Jun 17 2026 12:10 AM

సమయపాలన పాటించకపోతే చర్యలు

తిరుమలాయపాలెం: పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి కొందరు వైద్యులు, సిబ్బంది తూట్లు పొడుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆస్పత్రుల్లో సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిరుమలాయపాలెం సీహెచ్‌సీ ఆస్పత్రి ఆవరణలోనే ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదేశించినా పరిస్థితి మార్పు రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. సీహెచ్‌సీలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఓపీ సేవలు అందించాల్సిన వైద్యుల కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ఈ ఆస్పత్రిలో ఇటీవల ఓ వృద్ధుడికి చికిత్స సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో విచారణ జరుగుతోంది. అయినా మంగళవారం ఆర్‌ఎంఓ వైదేహితో పాటు ఆరుగురు డాక్టర్లు మాత్రమే హాజరయ్యారు. ఇందులో ప్రసూతి వైద్యురాలు ప్రసన్నజ్యోతి, అనస్తీషియన్‌ ప్రదీప్‌రెడ్డి ఇద్దరు మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేసి మధ్యాహ్నం వెళ్లిపోయారు. ఇక ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ బొల్లికొండ శ్రీనివాసరావు 11.30 గంటలకే వెళ్లిపోగా మరో వైద్యుడు లవన్‌కుమార్‌ మాత్రమే ఉన్నారు. ఆస్పత్రిలో 20 మందికి పైగా ఇన్‌ పేషంట్లు, కుటుంబ నియంత్రణ చేయించుకున్న మహిళలు ఇద్దరు ఉండగా.. అత్యవసర పరిస్థితి ఎదురైతే ఎవరు వైద్యం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు ఆస్పత్రిలో ఉండాల్సి ఉన్నా అలా జరగకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

సీహెచ్‌సీలో అందుబాటులో లేని వైద్యులు

ఆస్పత్రిలో వైద్యులు సమయపాలన పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఆస్పత్రిలో జరిగిన ఘటనపై విచారణ జరుగుతోంది. మరోమారు పరిశీలించి విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహించినట్లు తేలితే చర్యలు తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూస్తాం.

–రాజశేఖర్‌గౌడ్‌, డీసీహెచ్‌ఎస్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement