లేబర్‌కోడ్ల రద్దుకు ఉద్యమించాలి | - | Sakshi
Sakshi News home page

లేబర్‌కోడ్ల రద్దుకు ఉద్యమించాలి

Jun 16 2026 12:34 AM | Updated on Jun 16 2026 12:34 AM

లేబర్‌కోడ్ల రద్దుకు ఉద్యమించాలి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్‌ సబ్‌స్టేషన్‌కు స్థలం కేటాయించాలని వినతి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ వినతుల వెల్లువ

ఖమ్మం మామిళ్లగూడెం: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్ల రద్దుకై దేశ వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి శింగు నర్సింహారావు తెలిపారు. సోమవారం ఖమ్మం గిరిప్రసాద్‌ భవన్‌లో రావి శివరామకృష్ణ అధ్యక్షతన జరిగిన జిల్లా ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నూతన లేబర్‌ కోడ్ల ఆధారంగా యాజమాన్యాలు కార్మికులపై పనిభారం ఎనిమిది గంటల నుంచి 12 గంటలకు పెంచారన్నారు. సంఘం హక్కును, సమ్మె హక్కును నిరాకరించి, కనీస వేతనాలు, అదనపు పనికి అదనపు వేతనం చెల్లించడం లేదన్నారు. పెరుగుతున్న ధరలతో పెరగని వేతనాలతో కార్మికుల జీవితాలు దుర్బరమవుతున్నాయన్నారు. కార్మికుల సంఖ్యను తగ్గించి పని భారాన్ని పెంచుతున్నారన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, జిల్లా నాయకులు సిహెచ్‌ సీతామహాలక్ష్మి, పిల్లి రమేష్‌ పాల్గొన్నారు.

నేలకొండపల్లి: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఎవరైనా పట్టుకుంటారనే భయంతో వేగంగా వెళ్తూ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఏపీ నుంచి ప్రతీరోజు భారీగా ఇసుక తరలిస్తుండగా, నేలకొండపల్లి మండలం నుంచి వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఈక్రమాన సోమవారం కూడా నాలుగు ట్రాక్టర్లలో ఇసుక తీసుకొస్తుండగా మంగాపురంతండా గ్రామంలోకి రాగానే డ్రైవర్లు వేగం పెంచారు. ఇందులో ఓ ట్రాక్టర్‌ అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టగా స్తంభం విరిగి తీగలు వేలాడాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు సరఫరా నిలిపివేయిండంతో ప్రమాదం తప్పింది. ఆపై ట్రాక్టర్లను అడ్డుకోగా డ్రైవర్లు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. కాగా, ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని అధికారులకు సమాచారం ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు.

ఖమ్మం సహకారనగర్‌: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న టీజీఈ హైట్స్‌ (తెలంగాణ ఉద్యోగుల, పెన్షనర్ల హౌస్‌ బిల్డింగ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ) ఆవరణలో సబ్‌స్టేషన్‌ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.కు టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాస్‌, హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు కొండపల్లి శేషుప్రసాద్‌, డాక్టర్‌ పి.విజయ్‌కుమార్‌ వినతిపత్రం అందజేసి మాట్లాడారు. టీజీఈ హైట్స్‌లో 576 మంది ఉద్యోగుల గృహ నిర్మాణ పనులు జరుగుతున్నందున సమీపంలో ఎకరం స్థలాన్ని సబ్‌స్టేషన్‌కు కేటాయించాలని కోరారు. టీఎన్జీవో జిల్లా కోశాధికారి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మంమయూరిసెంటర్‌: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి మధ్యవర్తులు లేకుండా, వందశాతం పారదర్శకంగా సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ చేస్తున్నామని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 46 మంది లబ్ధిదారులకు రూ.16,64,500 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఆయన అందజేశారు.

పట్టణ ప్రాంతాల్లో ‘ఉపాధి’ కల్పించాలని..

ఖమ్మం మామిళ్లగూడెం: పట్టణ ప్రాంతాల్లో మహాత్మాగాంధీ ఉపాధి పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వై.విక్రం ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం సమస్యలపై కేఎంసీ కార్యాలయంలో కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. డివిజన్‌ కార్యదర్శి నాగేశ్వరరావు, రత్తమ్మ, వెంకన్న, పాపారావు, సైదులు, నరేష్‌, హిమం, సుదర్శన్‌, జనా ర్ధన్‌, పెంటయ్య, భద్రం రెడ్డి, మధు, ఉన్నారు.

బస్సులు ఆపాలని..

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం నగరంలోని గోపాలపురం వద్ద ఆర్టీసీ బస్సులను ఆపాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం ఆర్టీసీ అధికారులకు బీఆర్‌ఎస్‌ నాయకుడు భూక్యా అశోక్‌ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. గతంలో గోపాలపురంలో అన్ని బస్సులు ఆగేవని, కొంతకాలంగా బస్సులు అక్కడ ఆగకుండా నేరుగా వెళ్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని..

రఘునాథపాలెం: జీపీ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలను వెంటనే అమలు చేసి, వేతనాలను పెంచాలని కోరుతూ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ (టీయూసీఐ) నాయకులు సోమవారం ఎంపీడీవో అశోక్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా కార్యదర్శి జి.రామయ్య, మండల కార్యదర్శి రవి, ప్రసాద్‌, శ్రీనివాస్‌, మల్లుసూర్‌, రమేష్‌, సైదులు ఉన్నారు.

తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం

తిరుమలాయపాలెం: దేశంలో రైతుల పరిస్థితి దీనంగా ఉందని, దీనంతటికీ పాలకులు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలే కారణమని అఖిలభారత రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకులు మందుల రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం మండలంలోని బచ్చోడులో నిర్వహించిన ఏఐకేఎంఎస్‌ 7వ మండల మహాసభలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా మండల నూతన ధ్యక్ష కార్యదర్శులుగా గొర్రెపాటి వీరస్వామి, అచ్చ ఉప్పలయ్యతో పాటు మరో పదకొండు మందితో కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ప్రకాష్‌ జిల్లా సహాయ కార్యదర్శి పి.నాగయ్య, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్‌, ఆడెపు నగేష్‌, పట్టాభి, బ్రహ్మచారి, వెంకటేశ్వర్లు, మల్సూరు, మల్లయ్య, శ్రీను ఉన్నారు.

భవనం పైనుంచి పడి చిన్నారి మృతి

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం 11వ డివిజన్‌ పరిధిలో భవనంపై ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు కింద పడగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. వరదయ్యనగర్‌లోని కమతం అపార్ట్‌మెంట్‌ పెంట్‌హౌస్‌లో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌ ఏపూరి అనిల్‌కుమార్‌ కుటుంబంతో నివసిస్తున్నారు. ఆయన కుమారుడు ఉద్భవ్‌(5) ఆదివారం సాయంత్రం ఐదో అంతస్తులో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో తీవ్రగాయాలైన ఆయనకు చికిత్స చేయిస్తుండడంతో పరిస్థితి విషమించి మృతి చెందగా, తండ్రి అనిల్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్‌ సీఐ భానుప్రకాశ్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement