ప్రతీ చిన్నారికి ఆరోగ్య భద్రత | - | Sakshi
Sakshi News home page

ప్రతీ చిన్నారికి ఆరోగ్య భద్రత

Jun 16 2026 12:28 AM | Updated on Jun 16 2026 12:28 AM

● ఈనెల నేటి నుంచి ‘స్టాప్‌ డయేరియా’ క్యాంపెయిన్‌ ● కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.

● ఈనెల నేటి నుంచి ‘స్టాప్‌ డయేరియా’ క్యాంపెయిన్‌ ● కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.

ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలో ప్రతీ చిన్నారికి ఆరోగ్య భద్రత కల్పించడమే లక్ష్యంగా వైద్యులు, ఉద్యోగులు పనిచేయాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన వైద్య, ఆరోగ్యశాఖ కార్యక్రమాలపై అదనపు కలెక్టర్లు డాక్టర్‌ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మంగళవారం నుంచి వచ్చేనెల 31 వరకు ‘స్టాప్‌ డయేరియా’ పేరిట నిర్వహించే క్యాంపెయిన్‌లో భాగంగా ఐదేళ్లలోపు పిల్లల్లో డయేరియా కారణంగా సంభవించే మరణాల నివారణకు తీసుకో వాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. అంగన్‌వాడీలు, పాఠశాలలు, గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలిపారు.

● ఈనెల 28న పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగంగా పిల్లలకు శిబిరాల్లో చుక్కల మందు వేయాలని, 29, 30వ తేదీల్లో ఇంటింటి సందర్శన ద్వారా మిగిలిన పిల్లలకు కూడా మందు వేయాలని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో 0–5 ఏళ్ల పిల్లలు 80,411 మంది ఉన్నట్లు గుర్తించగా, అందరికీ చుక్కల మందు వేయడమే లక్ష్యంగా నిర్దేశించుకోవాలని సూచించారు.

● వచ్చేనెల 13న జాతీయ నులిపురుగుల నివారణ, 20న మాప్‌ అప్‌ కార్యక్రమం ద్వారా 1 – 19 ఏళ్ల వారికి ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ వయస్సు వారు జిల్లాలో 2,89,533 మంది ఉన్నారని వివరించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ రామారావు, డిప్యూటీ డెమో కే.వీ.రాజు తదితరులు పాల్గొన్నారు.

పనిదినాలు పెరిగేలా పర్యవేక్షణ

కొణిజర్ల/వైరా రూరల్‌: ఉపాధి పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యేలా చూస్తూ పని దినాలు కేటాయించాలని, పనుల్లో గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేవి ఎంపిక చేయాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ఆదేశించారు. కొణిజర్ల, వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో ఉపాధి హామీ పథకం పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏయే పనులు చేపడుతున్నారు, ఎందరు కూలీలు హాజరవుతున్నారనే వివరాలు ఆరా తీయడమే కాక హాజరు నమోదులో అవాంతరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.307 కూలీ దక్కేలా పనులు కల్పిస్తూ, ఎక్కువ మంది హాజరయ్యేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ఈక్రమంలో రైతులకు ప్రయోజనం జరిగేలా సాగునీటి వనరుల అభివృద్ధి, గ్రామాల్లో వసతుల కల్పన పనులనే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాలి. ఉష్ణోగ్రతలు ఇంకా కొనసాగుతున్నందున పని ప్రదేశాల్లోటెంట్లు, తాగునీరు, ఓఆర్‌ఎస్‌ అందుబాటులో ఉంచాలన్నారు. కాగా, రెండు వారాల వేతనాలు రాలేదని కూలీలు చెప్పగా, రెండు, మూడు రోజుల్లో జమ చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కొణిజర్ల, స్నానాల లక్ష్మీపురం సర్పంచ్‌లు గూదె పుష్పావతి, నూతి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓలు ఆర్‌.ఉపేంద్రయ్య, సక్రునాయక్‌, తహసీల్దార్లు ఎన్‌.అరుణ, సీహెచ్‌.సురేష్‌, ఉద్యోగులు రమేష్‌, గురుమూర్తి, రమేష్‌, మోష తదితరులు పాల్గొన్నారు.

వరద నష్టం నివారణకు

కార్యాచరణ

ఖమ్మం సహకారనగర్‌: వర్షాకాలంలో వరదల ద్వారా ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ఆదేశించారు. విపత్తుల నిర్వహణ సన్నద్ధతపై అదనపు కలెక్టర్లు క్టర్‌ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్యతో కలిసి ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కలెక్టరేట్‌లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడమే కాక 1077 టోల్‌ ఫ్రీ నంబర్‌పై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. వరద ముంపునకు గురయ్యే కాలనీలు, ప్రాంతాలే కాక అక్కడి ప్రజలను తరలించాల్సిన పునరావాస కేంద్రాలను ముందుగా గుర్తించాలని సూచించారు. ప్రతీ మండలంలో అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని తెలిపారు. ఈసమావేశంలో కల్లూరు సబ్‌ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌, ట్రెయినీ కలెక్టర్‌ పారస్‌ కుమార్‌, డీఆర్వో సీహెచ్‌.రామ్మూర్తి, జెడ్పీ సీఈఓ దీక్షారైనా తదితరులు పాల్గొన్నారు.

● వెలుగుమట్లలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని కలెక్టర్‌ దివాకర్‌ సూచించారు. వెలుగుమట్లలో నిర్మాణాలను పరిశీలించిన ఆయన సూచనలు చేశారు. ఈ విషయంలో లబ్ధిదారులకు అధికారులు సహకారం అందించాలని తెలిపారు. హౌజింగ్‌ పీడీ భూక్యా శ్రీనివాస్‌, ఈఈ జగ్గారావు పాల్గొన్నారు.

ఖమ్మం సహకారనగర్‌: ప్రజలు అందించే ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. సూచించారు. గ్రీవెన్స్‌ డేలో భాగంగా కలెక్టరేట్‌లో సోమవారం ఆయన అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశమై దరఖాస్తుల పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement