ఎత్తుకు.. పైఎత్తు ! | - | Sakshi
Sakshi News home page

ఎత్తుకు.. పైఎత్తు !

Jun 16 2026 12:28 AM | Updated on Jun 16 2026 12:28 AM

మిషన్‌ సక్సెస్‌ఫుల్‌..

ఏపీ నుంచి తెలంగాణలోకి అక్రమంగా ఇసుక రవాణా మారుబేరంతో రూ.కోట్లకు పడగలెత్తుతున్న ముఠాలు వీరికి అడ్డుకట్ట వేసేలా నిఘా, వ్యూహాత్మక ఆపరేషన్లు

సాక్షిప్రతినిధి, ఖమ్మం: అక్రమ సంపాదనకు అలవాటుపడిన ఇసుకాసురులు సరికొత్త వ్యూహాలతో అక్రమ రవాణాకు దారులు వెతుకుతున్నారు. ఇదేసమయాన నిరంతరం నిఘా, పక్కా ప్రణాళికతో వారి వ్యూహాలను పోలీసులు చిత్తు చేస్తూ చెక్‌ పెడుతున్నారు. ఇటీవల ఏపీ నుంచి ఇసుక తరలిస్తున్న కంటెయినర్‌ వైరాలో పట్టుబడింది. లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లలో ఇన్నాళ్లు ఇసుక తరలిస్తుండగా, కొత్తగా కంటెయినర్‌ పట్టుబడడం.. దీనికి ఎస్కార్ట్‌గా ఖరీదైన థార్‌ ఉండడం విస్తుపోయేలా చేసింది. ఇసుక అక్రమ రవాణాలో అందెవేసిన ఓ ముఠా ఈ పనికి పాల్పడినట్లు గుర్తించారు.

ఏపీ టూ తెలంగాణ

ఇసుక స్మగ్లింగ్‌లో ఆరితేరిన ఓ ముఠా నిత్యం దందాకు పాల్పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ఇసుక రీచ్‌ల వద్ద టన్ను రూ.200కు కొనుగోలు చేసి.. అక్కడి నుంచి పోలీసులను ఏమారుస్తూ సరిహద్దు దాటి తెలంగాణలోకి వాహనాలను చేరుస్తున్నారు. ఇక్కడ అవసరాల దృష్ట్యా టన్ను రూ.1,500 నుంచి రూ.2వేల వరకు అమ్ముతూ ముఠా రూ.లక్షలు దాటి రూ.కోట్లలో సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోనే కాక ఈ ముఠా హైదరాబాద్‌లో కూడా ఇసుక విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఖమ్మంకు చెందిన చల్లమల్ల వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు సుమంత్‌కుమార్‌ ఇసుక అక్రమ రవాణానే ప్రధాన వృత్తిగా ఎంచుకున్నట్లు తెలుస్తుండగా వైరాలో పోలీసులకు వీరిద్దరు పట్టుబడ్డారు. ఇందులో సుమంత్‌పై ఇప్పటికే 12కు పైగా కేసులు ఉండగా, కొన్నిసార్లు జైలుకు వెళ్లినా తీరు మారలేదని తేలింది. ఆయన తండ్రి వెంకటేశ్వరరావుపై గతంలో కేసులు నమోదయ్యాయి.

కొత్త ఎత్తుగడ..

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అలాగే నిఘా కూడా పటిష్టం చేశారు. అయినా ఆంధ్రప్రదేశ్‌లోని ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను తెలంగాణకు తరలించేందుకు ఈ ముఠా 22 చక్రాల భారీ లారీని కొనుగోలు చేసి చెక్కపలకలతో మార్పులు చేసి అసలు స్వరూపాన్ని మార్చేసింది. చెక్‌పోస్టుల వద్ద చూసినా ఏదైనా సామగ్రి తరలిస్తున్నారని భ్రమపడేలా కంటెయినర్‌ తరహాలో రూపొందించారు. అంతేకాక చెక్‌పోస్టులు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలను ముందుగా తెలుసుకునేందుకు ఖరీదైన థార్‌ వాహనంలో తమ అనుయాయులను పైలట్‌గా పంపించడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇసుక రవాణాను అడ్డుకునేందుకు సీపీ సునీల్‌దత్‌ ఆదేశాలతో వైరా ఏసీపీ సారంగపాణి పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు నిరంతరం నిందితుల కదలికలను పరిశీలించడం మొదలుపెట్టాయి. పోలీసులు, మైనింగ్‌, రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు చిక్కకుండా తప్పించుకునేలా ఇసుక రవాణా ముఠా కొత్త ఎత్తుగడలు అమలుచేస్తోందని సమాచారం అందడంతో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈక్రమంలోనే ఇసుక తరలిస్తున్న కంటెయినర్‌ పట్టుబడగా, ముఠా బాధ్యులు పాత నిందితులేనని గుర్తించారు.

స్మగ్లర్ల వ్యూహాలకు చెక్‌ పెడుతున్న పోలీసులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement