టామ్‌కాం ద్వారా దుబాయ్‌లో ఉద్యోగ అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

టామ్‌కాం ద్వారా దుబాయ్‌లో ఉద్యోగ అవకాశాలు

Jun 16 2026 12:28 AM | Updated on Jun 16 2026 12:28 AM

ఖమ్మం రాపర్తినగర్‌: తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌(టామ్‌కాం) ద్వారా దుబాయ్‌లో క్యాబ్‌ డ్రైవర్‌, బైక్‌ రైడర్‌ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్‌.మాధవి తెలిపారు. 23 – 45 ఏళ్ల వయస్సు కలిగి, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండడంతో ఇంగ్లిషు మాట్లాడడం, చదవడం తెలిసిన వారు అర్హులని పేర్కొన్నారు. క్యాబ్‌ డ్రైవర్‌కు నెలకు రూ.64వేల నుంచి, బైక్‌ రైడర్‌కు రూ.64,850 నుంచి ఆదాయం మొదలవుతుందని తెలిపారు. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు వివరాల కోసం 94400 49520, 94400 48590 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు.

వృద్ధులకు అండగా నిలుస్తాం..

ఖమ్మంలీగల్‌: వృద్ధులకు న్యాయసాయం అందించడంతో పాటు ఇతర అంశాల్లో అండగా నిలుస్తామని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి పి.దేవీమానస తెలిపారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఖమ్మంలోని జీవనసంధ్య వృద్ధాశ్రమంలో అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి దేవీమానస వృద్ధుల హక్కులు, సంక్షేమం కోసం అమల్లో చట్టాలను గురించి వివరించారు. అలాగే, వారి సమస్యలను తెలుసుకుని ఉచిత న్యాయసాయం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పారా లీగల్‌ వలంటీర్లు, వృద్ధాశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు.

రవాణా శాఖ స్పెషల్‌డ్రైవ్‌

ఆరు బస్సుల బాధ్యులపై కేసు

ఖమ్మంక్రైం: ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోని ప్రైవేట్‌ స్కూళ్ల బస్సులను గుర్తించేందుకు రవాణా శాఖ అధికారులు సోమవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. విద్యాసంవత్సరం మొదలు కావడంతో జిల్లావ్యాప్తంగా ఇన్‌చార్జ్‌ ఆర్‌టీఓ శ్రీనివాస్‌ ఆధ్వర్యాన తనిఖీ నిర్వహించారు. తొలిరోజు 79 బస్సులను తనిఖీ చేయగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోని ఐదు బస్సులతో పాటు ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ లేని మరో బస్సును గుర్తించి బాధ్యులపై కేసు నమోదు చేశారు. తనిఖీల్లో ఎంవీఐ రాజశేఖర్‌, ఏఎంవీఐలు స్వర్ణలత, ప్రమీల, మధు, రాంబాబు, సుమలత, రవిచంద్ర, దినేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఇన్‌చార్జ్‌ ఆర్‌టీఓ శ్రీనివాస్‌ మాట్లాడుతూ తనిఖీలు నిరంతరం కొసాగుతతాయని, అన్ని బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోకపోతే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement