నేలకొండపల్లి: మండలంలోని చెరువుమాధారం చెరువులో రెండేళ్ల తరువాత సోమవారం చేపల వేట మొదలైంది. కేజీన్నర, రెండు కేజీల బరువైన చేపలను తెప్పల ద్వారా వలలతో మత్స్యకారులు వేట సాగించారు. అయితే, పట్టిన చేపలను ఒడ్డుకు తీసుకొచ్చి వాహనాల్లో చేర్చేందుకు ఇబ్బంది ఎదురుకాగా వినూత్నంగా ఆలోచించారు. ఏకంగా క్రేన్ సాయంతో నేరుగా చెరువు నీటిలో నుంచి చేపల వలలను ఎత్తి ఒడ్డున ఉన్న వాహనంలోకి చేర్చారు. ఆపై అమ్మకానికి సూర్యాపేట జిల్లా కోదాడ తరలించారు. కాగా, చేపల వేట సందర్భంగా ఘర్షణ జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.


