ఫొటో పడక వెనుదిరుగుతున్న వైనం క్షేత్ర సహాయకులు, మేట్ లేరు.. 12 ఏళ్లుగా పంచాయతీ గుమస్తానే దిక్కు
నేలకొండపల్లి: జిల్లాలోనే అతి పెద్ద గిరిజన గ్రామ పంచాయతీ.. ఉపాధి హామీ పథకం పనులు అస్తవ్యస్తంగా మారాయి. కూలీలకు ఓ వైపు సాంకేతిక సమస్యలు వెంటాడుతుంటే మరోపక్క పనులు చేయించే వారు లేక కూలిలకు దూరమవుతున్నారు. ఈనేపథ్యాన నేలకొండపల్లి మండలం మంగాపురంతండా పంచాయతీలో ప్రతీ రోజు 120కు పైగా ఉపాధి కూలీలు పనులు చేస్తున్నారు. ఈక్రమాన ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు కూలీలకు తలనొప్పిగా మారాయి. కూలీ పనులు చేసినా ఫొటోలు యాప్‌లో పడకపోవడంతో వారి శ్రమ వృథా అవుతోంది. ముందుగా ఫొటోలు తీయాల్సి ఉండగా చాలా మందికి తీసుకోక రిజెక్ట్ అవుతున్నాయి. దీంతో పని లేకుండానే వెనుదిరుగుతున్నారు. ఈక్రమాన సోమవారం దాదాపు 20 మంది కూలీలు ఫొటోలు పడక పని ప్రదేశం నుంచి పంపించారు.
పర్యవేక్షకులు కరువు..
ఇక్కడ ఉపాధి హామీ పథకం పనులు అంటే అధికారులకు నిర్లక్ష్యం కాబోలు.. గత 12 ఏళ్లకు పైగా ఫీల్డ్ అసిస్టెంట్ లేకుండానే పనులు చేయిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి మేట్‌లు లేకుండానే పనులు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో ఇక్కడి ఉపాధి పనులకు పంచాయతీ గుమస్తా నాగేశ్వరరావు పర్యవేక్షించాల్సి వస్తోంది. ఇకనైనా అధికారులు నిర్లక్ష్యం వీడి యాప్‌లో ఫొటోలు పడేలా సాంకేతిక సమస్యలను పరిష్కరించి ఫీల్డ్ అసిస్టెంట్ లేదా కనీసం మేట్‌నైనా ఏర్పాటు చేయాలని ఉపాఽధి కూలీలు కోరుతున్నారు.
మార్పులతో కూలీలకు తప్పని తిప్పలు


